
క్రిస్మస్ వేడుకకు చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. క్రైస్తవుల ఇండ్లపై నక్షత్రాలు కాంతులీనుతున్నాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. ప్రార్థనలు, గీతాలాపనలతో క్రిస్టియన్లు ప్రేమమూర్తిని కొలిచారు. చర్చిల్లో కేక్ కట్ చేసి, నోరు తీపి చేసుకున్నారు. ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి ఆచరణీయమని, క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద క్రైస్తవులందరికీ ఇప్పటికే గిఫ్ట్ ప్యాక్‌లు అందించిన సంగతి తెలిసిందే.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. నల్లగొండ, మఠంపల్లి, కేతేపల్లి సహా చారిత్రక చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీస్తు జననాన్ని సూచించే పశువుల పాకలను విద్యుల్లతలతో ముస్తాబు చేశారు. విద్యుత్ బల్బులతో స్టార్లు అలంకరించారు. పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్న చిన్నారులు ఏసు క్రీస్తు, శాంటాక్లాజ్, దేవదూతల వేషధారణలో అలరించారు. మరోవైపు రాష్ట్ర
ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకను ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్రైస్తవులకు అందించారు.
నీలగిరి, డిసెంబర్24 : ఉమ్మడి జిల్లా క్రైస్తవులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మానవాళి సంక్షేమం కోసం ప్రార్థనలు ఘనంగా జరుగాలని ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు మార్గం ప్రపంచశాంతికి ప్రయోజనకరం అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుని ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవాలని కోరారు.
క్రైస్తవుల కోసం ‘శుభవార్త’
మఠంపల్లి, డిసెంబర్ 24 : మఠంపల్లి గ్రామంలో మంగళవార్త దేవాలయాన్ని 1899లో నిర్మించారు. క్రైస్తవుల సంఖ్య దినదినాభివృద్ధి చెందడంతో పావర్జేనిమ్ కార్నాల్ప 1916లో మరొక దేవాలయాన్ని నిర్మించారు. రెండోసారి నిర్మించిన దేవాలయం 1980 నాటికి జీర్ణావస్థకు చేరడంతో 1992లో ఆంథోనీ సారథ్యంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో నూతన దేవాలయ నిర్మాణం చేపట్టగా అల్లం మర్రెడ్డి పూర్తి చేశారు. నాటి నుంచి ఈ దేవాలయాన్ని మంగళవార్త, శుభవార్త దేవాలయం అని పిలుస్తుంటారు.
టీఆర్ఎస్ పాలనలోనే అన్ని మతాలకు సమ ప్రాధాన్యం
నార్కట్‌పల్లి, డిసెంబర్ 24: టీఆర్ఎస్ పాలనలోనే అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం దక్కిందని నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నార్కట్‌పల్లిలోని జీసస్ రిలేషన్ మినిస్ట్రీ హోమ్‌లో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్ స్రవంతి, నరేందర్‌రెడ్డి, భద్రాచలం, దాసరి రాజు, పాస్టర్ అబ్రహాం, రాజు, సుధాకర్ పాల్గొన్నారు.
క్రైస్తవులకు అండగా ప్రభుత్వం
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, డిసెంబర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉంటున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో నియోజకవర్గానికి చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలకు అనుగుణంగా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, మాధవరం సునీతా జనార్దన్‌రావు, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, జడ్పీటీసీ రమావత్ పవిత్ర, కేతావత్ బాలూనాయక్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, లోకసాని తిరుపతయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్‌నాయక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి, డిసెంబర్ 24 : క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. క్రిస్మస్ పురస్కరించుకుని మండల కేంద్రంలో శుక్రవారం కేక్ కట్ చేసి మాట్లాడారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందును ఎమ్మెల్యే ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు కె.ప్రదీప్‌రెడ్డి, చల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రసిద్ధి గాంచిన జపమాలమాత చర్చి
కేతేపల్లి, డిసెంబర్ 24 : కేతేపల్లి మండల కేంద్రంలోని జపమాల మాత చర్చి ఎంతో ప్రసిద్ధి చెందింది. 1950లో పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఈ చర్చిలో క్రిస్మస్తో పాటు జనవరి 5, 6, 7 తేదీల్లో క్రీస్తు సాక్షాత్కారాలు(ముగ్గురు రాజుల పండుగ) అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు హాజరవుతారు. ఇనుపాములకు ఆవాస గ్రామంగా ఉన్న రాయపురంలో ఇటలీకి చెందిన ఫాదర్ రొమానో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 2008లో పోప్‌పాల్ చేత చర్చి నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేశారు. మెదక్ చర్చి తర్వాత రెండో అతిపెద్ద గోపురం ఇక్కడే ఉన్నదని చెప్తుంటారు. భీమారంలోనూ వందేండ్లకు పైబడిన ఏసు తిరుహృదయ ప్రార్థనా మందిరం ఎంతో పేరొందింది.