కామారెడ్డి, డిసెంబర్ 10 : కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. జిల్లాలో 4.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణను ముమ్మరం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో గ్రామంలో రెండు నుంచి మూడు కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఇప్పటి వరకు 4.37లక్షల టన్నుల కొనుగోళ్లు…
వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 2,76,850 ఎకరాల్లో వరి సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 4.37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేక రించారు. మరో 50వేల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావారణం అనుకూలిస్తే మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు ఆధికారులు సమయాత్తం అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 175 కేంద్రాలను మూసివేశారు. బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 99 శాతం, జుక్కల్ నియోజకవర్గ పరిధిలో 95 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్‌మిల్‌కు తరలిస్తూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్టాక్ జీరో చేసేలా చూస్తున్నారు.
ధాన్యం రవాణాకు 7 సెక్టార్ల గుర్తింపు…
జిల్లాలో ధాన్యం రవాణాను 7 సెక్టార్ల ద్వారా చేపట్టారు. బాన్సువాడ, జుక్కల్, లింగంపేట, కామారెడ్డి, బీబీపేట, ఎల్లారెడ్డి సెక్టార్ల ద్వారా ధాన్యం రవాణా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధి లో 162 రైస్ మిల్లులకు గాను వీటిలో 125 రా రైస్‌మిల్లులు, 37 బాయిల్డ్ మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి లక్షా 10వేల మంది రైతులకు రూ.850 కోట్లను చెల్లించారు. ఈ వానకాలంలో 1,62,918 ఎకరాల్లో పంట సాధారణ విస్తీర్ణం కాగా, 2,76,850 ఎకరాల్లో పంట సాగు జరిగింది. సాధారణ విస్తీర్ణం కన్నా 170శాతం పెరిగింది. సన్న రకం 58,821 ఎకరాలు, దొడ్డు రకం 2,17,991 ఎకరాల్లో సాగైంది.
సజావుగా ధాన్యం సేకరణ
జిల్లాలో మరో వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వందశాతం ధాన్యం సేకరణకు ప్రణాళికలు రూపొందించాం. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నాం. రైతులకు బిల్లులు సకాలంలో అందిస్తున్నాం.
సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
రైతులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఖాతా ల్లో జమ చేయడంతో పాటు రవాణా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 4.37లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.700 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.
పకడ్బందీ చర్యలు
జిల్లాలో ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. 344 కేంద్రాలను ఏర్పాటు చేయగా 175 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.