సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు దత్త జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆశ్రమ ఆవరణలో చలువ పందిళ్లు, తాగునీరు, భోజన వసతి కల్పించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆశ్రమ ముఖద్వారంతో పాటు దత్తాత్రేయుడు, ఆత్రేయ మహర్షి, అనుసూయమాత, జ్యోతిర్లింగాలు, పంచవృక్షాలు, రేణుకామాత, నవగ్రహాల ఆలయాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆశ్రమం ముందు ఉన్న రోడ్డుకు ఇరువైపులా దుకాణాల ఏర్పాటు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఝరాసంగం, డిసెంబర్ 15: వంద ఏండ్లకు పైబడి మానూర్ మండలంలోని బెల్లాపూర్లో వీరయ్యస్వామి వీరమణెమ్మల దంపతులకు నాగేంద్రయ్యస్వామి జన్మించారు. 12 ఏండ్ల వయస్సులో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామ శివారులో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భక్తుల విరాళాలతో దత్తాత్రేయడి ఆలయ నిర్మాణం చేపట్టి పూజలు చేస్తూ భక్తులను భక్తిమార్గంలో పయనించేందుకు కృషిచేశాడు. ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఏటా దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామిజీ ఆశ్రమ ఆవరణలో 1962లో మేడి, రాగి, నిమ్మ, వేప, మర్రి పంచవృక్షాలు నాటి 12 ఏండ్ల పాటు వాటి కింద దత్తగిరి మహారాజ్ కూర్చొని, కఠోర దీక్షతో తపస్సు చేసినట్లు స్థానికులు తెలిపారు. స్వామిజీకి వయస్సు మీదపడుతున్న తరుణంలో బర్దీపూర్ చెందిన గాళయ్యస్వామి ఆశ్రమంలో పశువుల కాపరిగా పనిచేస్తూ శిష్యుడిగా మారిపోయిన స్వామిజీయే ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్‌గా కొనసాగుతున్నాడు.
మూడు రోజులు హోమాలు..
దత్తజయంతిని పురస్కరించుకుని భావి పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందగిరిస్వామి, గణపతి దీక్షితులు, ఆశ్రమ కమిటీ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో ఈనెల 17,18,19,20, 21వ తేదీల్లో 21 యజ్ఞగుండాలతో హోమాలు నిర్వహిస్తాం. 17న పూర్ణాహుతి, మధ్యాహ్నం దత్తాత్రేయ డోలారోహణం, సాయంత్రం ఆరు గంటలకు 21,600 దీపాలతో భక్తులచే దీపారాధన, ఆ తర్వాత రాత్రికి ఆధ్యాత్మిక సభలు, కీర్తనలు, భజనలు, సంగీత కచేరి నిర్వహిస్తాం. 18న పల్లకీసేవ, ఊరేగింపు, ప్రసాద వితరణ, 19వ తేదీన పాదపూజ, రుద్రాభిషేకం, రాత్రి 8 గంటలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం, భజనలు, కీర్తనలు,సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నూతనంగా నిర్మాణం చేసిన గోమాత దేవాలయాన్ని ప్రారంభిస్తాం.
ఉత్సవాలకు బస్సులు, పోలీసు బందోబస్తు
దత్త జయంతికి జహీరాబాద్ నుంచి బర్దీపూర్ ఆశ్రమానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్, రూరల్ సీఐ భరత్ కుమార్, ఎస్సై గోపి పోలీసు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ మాజీద్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.