స్థానిక సంస్థలను బలోపేతం చేయడంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో నిధులు లేక నిస్సహాయ స్థితిలో పాలకవర్గాలు ఉండగా… ఇప్పుడు భారీగా నిధులు మంజూరు కావడంతో హర్షం వ్యక్తమవుతున్నది. పల్లెల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం దక్కిందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు జడ్పీలతోపాటు 49 మండల పరిషత్‌లకు రూ.21.85 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు రూ.6.18 కోట్లు, 27 మండలాలకు రూ.6.09కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లా పరిషత్‌కు రూ.4.82 కోట్లు, 22 మండల పరిషత్‌లకు రూ.4.76 కోట్లు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ 2021-22 బడ్జెట్ సమావేశంలో ప్రకటించిన మేరకు మండల, జిల్లా పరిషత్‌లకు తాజాగా నిధులు విడుదలయ్యాయి
నిజామాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతన జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయడంతో వికేంద్రీకరణ ఫలాలు కింది స్థాయికి చేరుతున్నాయి. గతంలో జిల్లా పరిషత్‌లో పుష్కలంగా నిధులు ఉండేవి. పల్లెల్లో విరివిగా అభివృద్ధి పనులు చేపట్టేవారు. గ్రామాల సమగ్రాభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పరిషత్‌లకు భారీగా నిధులు విడుదల చేస్తున్నది. గతంలో ఏడాదికి ఒక్కసారే వచ్చే వాటి కోసం ఎదురు చూసేవారు. ప్రస్తుతం పల్లె ప్రగతి పేరిట ప్రతి నెలా జమ అవుతుండడంతో పంచాయతీ అకౌంట్లలో నిధులు సమృద్ధిగా ఉంటున్నాయి. వీటిని సద్వినియోగపర్చడంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వీటితో పాటు ప్రస్తుతం జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ప్రభుత్వం రూ.కోట్లు నిధులు మంజూరు చేయడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్‌లకు రూ.11కోట్ల నిధులు కేటాయించారు. ఉభయ జిల్లాల్లో మొత్తం 49 మండలాలకు రూ.10.85 కోట్లు నిధులు జమ అయ్యాయి. భౌగోళిక విస్తీర్ణం, మండలాల సంఖ్య, జనాభా ఎక్కువగా ఉండడంతో కామారెడ్డితో పోలిస్తే నిజామాబాద్ జిల్లాకు అధికంగా నిధులు వచ్చాయి.
పరిషత్‌లకు పూర్వ వైభవం…
స్థానిక సంస్థల పరిపాలనను బలోపేతం చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఈ మేరకు భారీగా నిధులు మంజూరు చేసింది. వాటికి పూర్వ వైభవం తేవాలని సీఎం కేసీఆర్ 2021-22 బడ్జెట్ సమావేశంలోనే ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రూ.కోట్ల నిధులు విడుదలయ్యాయి. వివిధ పద్దుల కింద వీటిని విడుదల చేశారు. గతంలో నిధులు లేక నిస్సహాయ స్థితిలో పాలకవర్గాలు ఉండగా… ఇప్పుడు భారీ స్థాయిలో నిధులు విడుదల కావడం తో హర్షం వ్యక్తం అవుతున్నది. పల్లెల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం దక్కిందని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు మురుగు కాల్వలు, సామాజిక భవనాలు, ప్రహారీలు తదితర అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నిధులపై ఆయా పాలకవర్గ సభ్యులు మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశా ల్లో చర్చించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు రూపొందించి అమలు చేయాలి. బిల్లుల చెల్లింపు బాధ్యతను పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు చూసుకుంటారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు గతం కన్నా నిధులు అత్యధికంగా మంజూరయ్యాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మండల పరిషత్‌ల నిధులు నేరుగా ఆయా మండల పరిషత్‌లకు జమ అయ్యాయి. అక్కడే సమావేశాలు నిర్వహించి పనులకు ఆమోదం తీసుకుంటారు.
మంజూరైన నిధుల వివరాలు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జడ్పీ, మండల పరిషత్‌లకు నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో రెండు జడ్పీలతో పాటు 49 మండల పరిషత్‌లకు నిధులు జమ అయ్యా యి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రూ.21.85 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ జిల్లాల పరిషత్‌లకు రూ.11 కోట్లు, 49 మండల పరిషత్‌లకు రూ.10.85 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 బడ్జెట్ సమావేశాల్లో జిల్లా, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరవ్వడంతో నీరసించిన పరిషత్‌లకు ఆర్థికశక్తి నింపినట్లు అయ్యింది. నిధు లు నేరుగా జిల్లా, మండల పరిషత్‌ల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. వాటిని ఖర్చు ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు రూ.6.18 కోట్లు, 27 మండలాలకు రూ.6.09కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లా పరిషత్‌కు రూ.4.82 కోట్లు, 22 మండల పరిషత్‌లకు రూ.4.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
అభివృద్ధి బాటలో గ్రామాలు
గ్రామాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో ప్రభుత్వం పల్లె ప్రగతిని ఆచరణలోకి తెచ్చింది. 2019, సెప్టెంబర్‌లో ప్రారంభించి పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతను ఇచ్చారు. గ్రామాల్లోనూ మున్సిపాలిటీల్లో అమలవుతున్నట్లుగానే ఇంటింటి చెత్త సేకరించే కార్యక్రమానికి నడుం బిగించారు. అనంతరం చెత్త బుట్టలను తరలించడం, కంపోస్టు షెడ్డులో తడి, పొడి వేరుగా చేసి సేంద్రియ ఎరువు ల తయారీకి ప్రణాళికలు రూపొందించారు. వీధి దీపాలు, శిథిలావస్థ భవనాలు కూల్చివేత వంటి కార్యక్రమాలను అమలు చేశారు. ప్రతి పంచాయతీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాక్టర్, ట్యాంకర్లను సమకూర్చారు. ప్రతిష్టాత్మకంగా రూ పొందించిన పథకం కార్యాచరణకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా నిధులను సైతం క్రమం తప్పకుండా మంజూరు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను గ్రామ పంచాయతీలకు సమకూరుస్తుండడంతో పల్లెలు కొంగొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. అభివృద్ధి బాటలో పల్లెలు పయనిస్తూ దేశానికే రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా జడ్పీ, మండల పరిషత్‌లకు నిధులు విడుదలవ్వడంతో మరోమారు గ్రామాల్లో ప్రజాసౌకర్యాలు మెరుగుపడనున్నాయి.