
కొత్త సంవత్సరం అనగానే.. జీవితం కొత్తగా ప్రారంభించాలని, ఈ ఏడాది మరింత ప్రగతి సాధించాలని భావిస్తారు. వ్యసనాలకు స్వస్తి పలకాలని, మంచి పనులు మొదలుపెట్టాలని అనుకుంటారు. జనవరి ఒకటి నుంచి ఏదో ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టాలనుకుంటారు! షెడ్యూల్ పెట్టుకుని మరీ అమలు చేయాలనుకుంటారు! కొందరు మందు, సిగరెట్ మానేయాలనుకుంటారు. మరికొందరు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలనుకుంటారు. ఇంకొందరేమో రోజు ఉదయమే లేవాలని, వాకింగ్‌కు వెళ్లాలని, డైరీ రాయాలని అనుకుంటారు. కానీ, కొందరే పాటిస్తారు. మొదట్లో కొద్ది రోజులపాటు బాగానే ఉంటున్నా, తర్వాత పాత అలవాట్లను యథావిధిగా కొనసాగిస్తున్నారు. మళ్లీ ఏదో ఒక రోజు నుంచి తమ నిర్ణయాన్ని పాటిస్తామని వాయిదా వేస్తున్నారు. అందుకే మళ్లీ కొత్తేడాది నుంచి మారాలని అనుకున్న! ఈ సారి మాత్రం కచ్చితంగా మారుత! ’ నూటికి 90 శాతం మంది ఇలానే కొత్త సంవత్సరం వస్తుందనగానే ఇలా ఓ షెడ్యూల్ పెట్టుకుంటారు! నాలుగు రోజులకే వదిలేస్తారు! అయితే, ఈ సారైనా ఇలాంటి వారంతా మారుతారని ఆశిస్తూ..
మద్యం మత్తు నుంచి బయటపడలేమా?
మద్యం అలవాటు మొదట్లో ఫ్రెండ్స్‌ను చూసో.. ఇంకెవరినో చూసో మొదలవుతుంది. అది ఒక్క పెగ్‌తోనే ప్రారంభమవుతుంది. ప్రారంభంలో అంతా మాములుగానే ఉంటుంది. అది క్రమంగా క్వార్టర్, ఆఫ్ లేదంటే ఒక బీర్, రెండు బీర్లకో పెరుగుతుంది. తర్వాత బానిసలుగా మారుస్తుంది. అప్పటి దాకా ఆ మత్తు ప్రభావం తెలియదు. అందుకే చాలా మంది మద్యం ఏదో ఒక సందర్భంలో మద్యం మానేయాలనుకుంటారు. అలానే అయ్యప్ప దీక్షనో.. హనుమాన్ దీక్షనో తీసుకుని ఇక మందుకు దూరంగా ఉండాలనుకుంటారు. లేదంటే డిసెంబర్ 31న పీకల దాకా తాగి, కొత్త సంవత్సరం నుంచి వదిలేయానుకుంటారు. కానీ, ఆ మత్తు నుంచి బయటపడలేకపోతున్నారు.
జీవితాలకు పొగ
దాదాపు మందు లాగానే స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. తెలిసీతెలియని వయసులో హీరోలను అనుకరించో.. అమ్మాయిల ముందు ఫోజులు కొట్టడం కోసమో సిగరెట్లు తాగుతున్నారు. మొదట్లో రోజుకు ఒకటి రెండు తాగినా, రానూ రానూ బానిసలవుతున్నారు. కొందరైతే చైన్ స్మోకర్లుగా మారుతున్నారు. ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక సందర్భంలో మానేయాలనుకున్నా, మానేయలేకపోతున్నారు. ఆ పొగ నుంచి బయటపడలేకపోతున్నారు.
మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే అనారోగ్యం
ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే అనారోగ్యం ‘కొని’ తెచ్చుకోవాల్సిందే. కొందరికి మాంసం లేకుంటే ముద్ద దిగదు. వారం, రోజుతో సంబంధం లేదు. శరీరంలో కొవ్వు పెరుగుతున్నా, బరువు పెరుగుతున్నా లెక్కే లేదు. ఎప్పుడంటే అప్పుడు నీసు ఉండాల్సిందే. ఎంతో మంది అతిగా మాంసాంహారం తింటూ, లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తర్వాత తేరుకొని వారానికి ఒకటి రెండు రోజులు ఉపవాసాలు ఉంటారు. లేదంటే నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. ఇంకా ఓ రోజు చూసుకుని నాన్‌వెజ్ మానేస్తామంటూ శపథం చేస్తారు. ఎక్కువగా కొత్త సంవత్సరం నుంచి దూరంగా ఉంటామని చెబుతుంటారు. కానీ, మళ్లీ ఏదో ఒక ఫంక్షన్లోనో, మందుతాగినప్పుడో మళ్లీ లొట్టలేసుకుని మరీ తింటారు.
సెల్‌కు బానిస..
సెల్‌ఫోన్ ప్రమాదకర వ్యసనంలా మారింది. చాలా మంది దీని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ దూరంగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్లో సోది పెడుతున్నారు. లేదంటే సోషల్ మీడియాకు అంకితమవుతున్నారు. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం లేటుగా లేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో పనులను వాయిదా వేస్తున్నారు. ఏ రోజు కారోజు రాత్రి ఫోన్ ముట్టద్దని అనుకుంటున్నా అర్ధరాత్రి వరకు అందులోనే లీనమవుతున్నారు. మానసిక రుగ్మలతోపాటు ఎన్నో రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
వ్యాయామం గుర్తుకొస్తోంది
ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు! ఏదైనా అనారోగ్యం వచ్చినప్పడో, శరీరంపై ధ్యాస పెరిగినప్పుడో వ్యాయామం గుర్తుకువస్తుంది. లేదంటే తమ అభిమాన హీరోలు, క్రీడాకారులను చూసో వాకింగ్‌కో, జిమ్కో వెళ్లాలనుకుంటారు. కానీ, చాలా మంది బద్ధకంతో ప్రతి రోజూ వాయిదా వేస్తారు. రేపటి నుంచి కచ్చితంగా వెళ్తామని తమకు తామే చెప్పుకుంటారు. ఒకటి రెండు రోజులు బలవంతంగా వెళ్లినా, తర్వాత ముసుగు తన్ని పడుకుంటారు.
ఇంకా ఎన్నో..
కొత్త సంవత్సరమస్తే ఒక్క మందు, పొగ, మంసాహారమే కాదు ఇంకా ఎన్నో వ్యసనాలకు దూరంగా ఉండాలనుకుంటారు. గుట్కా, పాన్, జూదం లాంటివన్నీ మానేయాలనుకుంటారు. చాలా మంది కొత్తగా లక్ష్యాలు పెట్టుకుంటారు. ఇక నుంచి ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని, ప్రతినెలా పొదుపు చేయాలని, బాగా చదవాలని, సమయపాలన పాటించాలని అనుకుంటారు. కొద్ది రోజులపాటు బాగానే పాటిస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న కారణాలతోనే వదిలేస్తారు. ఇలా ఏది చేసినా మధ్యలోనే మానేస్తారు.
మార్పు మంచిదేగా..
కొత్త సంవత్సరంలో కొంగొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాలని, ఏదో జనవరి వచ్చింది కదా అని కాకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. ప్రతి ఏడాది మన గెలుపులో ఓ మెట్టు కావాలని, అది మనలను విజయతీరాలకు చేర్చేలా ఉండాలని చెబుతున్నారు. ఇంకా ఎన్నో మధురానుభూతులను మిగిల్చాలే తప్ప మన విలువైన జీవితాన్ని చేజార్చేలా ఉండద్దని హెచ్చరిస్తున్నారు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ ముఖ్యం. ఏ రోజు చేయాల్సిన పనులను ఆ రోజే చేయాలి. ఏ పని మొదలు పెట్టినా నిబద్ధతతో చేయాలి. రేపూ మాపూ అంటూ వాయిదాలు వేయద్దు. సమయం మనకు ఎంత ముఖ్యమో మిగతా వారికి అంతే ముఖ్యం అన్న విషయాన్ని మరిచిపోవద్దు. అందుకే సమయపాలన పాటించాలి.
కొత్త ఏడాది నుంచి డైరీ రాయడం మొదలుపెట్టాలి. రోజువారీగా మనం చేసే పనులు, ఇతరత్రా ముఖ్యమైన వాటిని నమోదు చేసుకోవాలి. దాని వల్ల మనం చేసే పనులు, తీసుకుంటున్న నిర్ణయాలను తిరిగి సమీక్షించుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలో నిర్దేశించుకోవచ్చు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒక్కసారే కదా అని పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లొద్దు. వాటి బారిన పడితే బయటపడడం తేలిక కాదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి.
ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సమయానికి పడుకోవాలి. ఉదయమే లేవాలి. రోజూ వ్యాయామం చేయాలి. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోకుండా సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. పుస్తక పఠనం, యోగాతో ఒత్తిడిని జయించాలి. వీలైనంత సమయం ఆత్మీయులకు కేటాయించాలి.
జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మనం సంపాదించే దానిలో కొంతలో కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అది మనకు ఆపద సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్‌కు భరోసా ఇస్తుంది.
జ్ఞాపకాలు పదిలం
జ్ఞాపకాలు పదిలంగా ఉండాలంటే డైరీ రాయాలి. ఏడాది తర్వాత ఒకసారి చూసుకుంటే మరుపురాని జ్ఞాపకాలను మన కళ్లముందుంచుతుంది. అన్నింటికీ మించి మనం రోజు వారీ పనులను గుర్తుచేస్తుంది. అందుకే విద్యావంతులంతా కొత్త సంవత్సరం నుంచి కచ్చితంగా డైరీ రాయాలని అనుకుంటారు. చాలా మంది వారం పది రోజులు రాసి డైరీలను మూలన పడేస్తారు. తర్వాత రాస్త, మళ్లీ రాస్త అని మరిచిపోతారు. చివరగా చూస్తే డెయిరీ నిండా ఖాళీ పేజీలే కనిపిస్తాయి.