
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోనే అత్యధి కంగా తొలిరోజు నల్లగొండ జిల్లా రైతులకు రైతుబంధు డబ్బులు అందాయి. ఉదయం 9 గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లుగా మెస్సేజ్‌లు రావడం మొదలైంది. ఎకరం లోపు ఉన్న రైతులకు మంగళవారం రైతుబంధు డబ్బులు అందాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి రోజు 2,54,686 మంది రైతులకు 79.81కోట్ల రూపాయల నగదు ఖాతాల్లో జమ అయ్యింది. ఇందులో ఒక్క నల్లగొండ జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా 1,19,364 మంది రైతులకు గానూ 37.89కోట్ల రూపాయల పెట్టుబడిసాయం అందింది. తర్వాత ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది.
నేడు రెండెకరాల్లోపు వారికి
సూర్యాపేట జిల్లాలో మొత్తం 74,486 మంది రైతుల ఖాతాల్లో 24.17కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 60,836 మంది రైతులకు 17.74 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసింది. నేడు రెండు ఎకరాల లోపు రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. దశలవారీగా పది రోజుల లోపే పట్టాదారు పాసుపుస్తకం ఉండి వివరాలు అందజేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనున్నది. యాసంగిలో గతంలో ఎన్నడూ లేనంతగా సాయం ఉమ్మడి జిల్లా రైతులకు అందనున్నది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 12.32 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4.93 లక్షల మంది రైతులకు రూ. 616.21కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో 6.29లక్షల ఎకరాల విస్తీర్ణానికి గాను 2.70లక్షల మంది రైతులకు 314.95కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా లో 6.04లక్షల ఎకరాల విస్తీర్ణానికి గాను 2.43లక్షల మంది రైతులకు రూ. 302.03 కోట్ల పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. వీరందరికీ వచ్చే పది రోజుల లోపే ఖాతాల్లో నగదు జమ కానుంది.
ఇక పనులు షురూ చేస్తా
యాసంగి సీజన్‌కు ప్రభు త్వం నుంచి పెట్టుబడి సాయం అందింది. ఒకరి వద్ద చేయి చాపకుండా సాయం అందించడం సంతోషంగా ఉంది. ఇప్పటికే కాల్వ నీళ్లు వదిలినరు. రైతుబంధు కింద బ్యాంకు ఖాతాలో రూ. 5వేలు వచ్చినయ్. సర్కారు డబ్బులతో పిండి కట్టలు, కల్పు మందు కొనుగోలు చేస్తా, ట్రాక్టర్‌తో పొలం దమ్ము చేయించి నాటు పెడత.
-బంటు యాదగిరి, రైతు, వేములపల్లి
సంతోషంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా ప్రతికారుకూ ఎకరాకు రూ.5వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈరోజూ నా ఖాతాలో డబ్బులు పడినై. యాసంగి పంట సాగు చేసేందుకు పెట్టుబడి కోసం మా ఇబ్బందులు తీరుతున్నై. రైతులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ మాకు దేవుడు.
-నడ్డి లింగయ్య, రైతు, కొత్తలాపురం, గుర్రంపోడు మండలం
సాయం మరువలేం
సీఎం కేసీఆర్ పెట్టుబడికి సాయం అందించడం బాగుంది. ఎకరాకు రూ.5 వేలు రావడంతో ఎక్కడా అప్పు చేయకుండా పంటకు పెట్టుబడులు పెడుతున్నాం. నాకున్న రెండున్నర ఎకరాల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా ఎకరం భూమిలో వరి సాగు చేసి సగంలో ఆరుతడి పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నా.
-ఐతగోని వెంకన్నగౌడ్, రైతు, ఆకారం
దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుండు. నాకున్న రెండు ఎకరాలకు సంవత్సరానికి రెండు సార్లు పెట్టుబడి సాయం అందుతున్నది. కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో పంటలు పండిస్తున్నా. రైతులకు ఉచిత కరంటు ,సాగు నీరు పుష్కలంగా వస్తున్నాయి. ఇక రైతులకు ఏంకావాలి.
-లెంకల గణేశ్‌రెడ్డి, రెడ్డి కాలనీ ,నల్లగొండ మండలం
పెట్టుబడికి ఎంతో ఉపయోగకరం
సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులు తెలుసుకొని పెట్టుబడి కింద ఎకరానికి రూ.5వేలు ఇస్తుండు. ఆ డబ్బులతో మేము యాసంగి పంటకు విత్తనాలు, ఎరువులు కొంటాం. నాకు 10కుంటల పొలం ఉండగా రైతుబంధు పథకం కింద రూ.1250 నా ఖాతాలో జమయ్యాయి. రైతుబంధు పథకం ఎంతో మంది రైతులకు ప్రయోజకరంగా ఉంది.