భువనగిరి అర్బన్, జనవరి 6 : జిల్లా మహిళా సమాఖ్యల పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ పమేలా సత్పతి మహిళా సమాఖ్య సభ్యులను అభినందించారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆ సంఘం 51వ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా జిల్లా మహిళా సమాఖ్యలు పనిచేస్తున్నాయని, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయని అన్నారు. బ్యాంకు లింకేజీ విషయంలో ఎన్పీఏ జీరో శాతానికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. మహిళలు కొత్త విషయాలు తెలుసుకునేందుకు, మార్కెంటింగ్ తదితర అంశాలపై అవగాహన కోసం ఇతర రాష్ర్టాల్లో క్షేత్ర సందర్శనకు వెళ్లాలని అన్నారు. మహిళా సంఘాలు నిర్ణీత సమయంలో సమావేశాలు నిర్వహించుకోవాలని, రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెర్ప్ కార్యక్రమాల్లో జిల్లా ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్, జీవనోపాధులు, స్త్రీనిధి, ఆరోగ్యం, పోషణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ జోజప్ప, డీపీఎం ఆనంద్, శ్రీను, సునీల్, ఏపీఎం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ల పరిశీలన
భువనగిరి కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గోడౌన్‌లోని ఈవీఎంలను కలెక్టర్ పమేలాసత్పతి గురువారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఆమె వెంట రాజకీయ పార్టీల నాయకులు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, బి.రాంచంద్రయ్య, ఎ.అశోక్, తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.