మనోహరాబాద్, డిసెంబర్ 22 : రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఏవో స్రవంతి సూచించారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లిలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి చేయడంతో భూసారం పెరుగుతున్నదన్నారు. అంతేకాకుండా ఆరుతడి పంటలు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, సర్పంచ్ ప్రభావతి, ఉపసర్పంచ్ ధర్మేందర్, నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట మండలం చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల, గుండ్లపల్లి, దొంతి, మగ్దూంపూర్, గంగాయిపల్లి గ్రామాల్లో ఆరుతడి పంటలపై ఏవో ప్రవీణ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయశాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఈవోలు మజీద్అలీ, మౌనిక, రవి, సుభాష్, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.
ఇతర పంటలపై అవగాహన..
నర్సాపూర్, డిసెంబర్ 22 : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, చిప్పల్తుర్తి, కాగజ్మద్దూర్, పెద్దచింతకుంట గ్రామాల్లో బుధవారం యాసంగి పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇతర పంటలైన వేరుశనగ, కుసుమ, నువ్వులు, ఆముదం వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఈవోలు హరికృష్ణ, రాజు, ప్రసాద్, శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలతోనే అధిక లాభాలు..
కొల్చారం, డిసెంబర్ 22 : ఆరుతడి పంటలతో అధిక లాభాలు పొందవచ్చని ఎంపీపీ మంజుల రైతులకు సూచించారు. మండల పరిధిలోని ఎనగండ్లలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పంట మార్పిడి చేయడంతో భూములు సారవంతంగా మారుతాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ భూపాల్‌రెడ్డి, ఏఈవోలు వినితాభవాని, అంబిక, కావేరి తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు సాగు చేయాలి..
నిజాంపేట, డిసెంబర్ 22 : యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని తహసీల్దార్ జైరాములు రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పనగుల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటల సాగుకు తక్కువ పెట్టుబడి, తక్కువ నీళ్లు అవసరమన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రవర్ధిని, ఉపసర్పంచ్ సంజీవులు, ఏవో సతీశ్, ఏఈవో శ్రీలత, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలతో అధిక ఆదాయం..
పెద్దశంకరంపేట, డిసెంబర్ 22 : ఆరుతడి పంటలతో అధిక ఆదాయం పొందవచ్చని తహసీల్దార్ చరణ్, సర్పంచ్ జగన్మోన్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జూకల్, కొత్తపేట గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం యా సంగి పంటల మార్పిడిపై పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏవో అమృత్, ఏఈవోలు పాల్గొన్నారు.
ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలి..
తూప్రాన్ రూరల్, డిసెంబర్ 22 : ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని డిప్యూటీ వ్యవసాయాధికారి రాజశేఖర్ సూచించారు. బుధవారం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనాయిపల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటలైన పెసర, మినుములు, శనగ, వేరుశనగ, కూరగాయాల పంటలు పండించాలని సూచించారు. అనంతరం యాజమాన్య పద్ధతులపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కోనాయిపల్లి సర్పంచ్ పాండు, ఏఈవో సింధు, రైతులు పాల్గొన్నారు.