కేంద్రంపై పోరుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఊరూరా బీజేపీ దిష్టిబొమ్మల దహనం, చావుడప్పులు మోగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొననున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో నిర్వహించే ఆందోళనల్లో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతారు. బీజేపీ తీరును ఎండగడుతూ, ధాన్యం సేకరించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటానికి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టతనిచ్చే వరకు పోరాటం చేస్తామని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.
సిద్దిపేట, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి ధాన్యం సేకరణలో విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం (నేడు) టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతు సంఘాలు, రైతులతో కలిసి ఊరూరా బీజేపీ దిష్టిబొమ్మల దహనం, చావుడప్పును మోగించనున్నారు. తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్నారు. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసే వరకు టీఆర్ఎస్ పోరాటం చేయనున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నేడు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్పర్సన్లు పాల్గొననున్నారు. ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
ఊరూరా దిష్టిబొమ్మల దహనం..
ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేయడంతోపాటు ఊరూరా చావుడప్పును మోగించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేయడం, రైతులకు అన్నింటా అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం గురించి అన్ని గ్రామాల్లో రైతులకు వివరించనున్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మార్పు రానైట్లెతే, గ్రామాల్లోని రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వివరించనున్నారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి వరి వేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు అనే విషయాన్ని వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకపోవడంతో యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గమనించి రైతులు ఇతర పంటల సాగుకు ఆసక్తి చూపేందుకు, ఆయా పంట ఉత్పత్తుల వివరాలను రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో వివరించానున్నారు.
నిరసనల గళం..
ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నవంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడంతో పాటు రాష్ట్ర రాజధానిలో టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్ మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలుపుతూనే ఉంది. తెలంగాణ రైతులకు కేం ద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. ఇక్కడి రైతులపై వివక్ష చూపుతున్నది. దేశంలో అన్నింటా ఒకే విధానం ఉండాలి. కానీ, ఒకే దేశంలో రెండు రాష్ర్టాల్లో రెండు విధాలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ధాన్యం కొనరట, పంజాబ్ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చేస్తరంట, ఇదెక్కడి న్యాయం అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, స్థానిక బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టా లు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేదీ తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నది. రాష్ర్టా లు రైతులు పంటలు పండించడానికి కావాల్సిన కరెంట్, నీళ్లు తదితర సౌకర్యాలు సమకూరుస్తాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుకు రాష్ట్రంలో రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనల బాట పట్టారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తున్నది. ఇప్పటికే మెదక్ జిల్లాలో వందశాతం ధాన్యం సేకరణ పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వందశాతం ధాన్యం సేకరణ పూర్తి కానున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 945 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వెంటనే రైస్‌మిల్లులకు పంపించి రైతులకు టక్షీట్ వచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమచేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 8,90,916 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీని విలువ సుమారుగా రూ.1,800 కోట్లు ఉంటుంది. రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తి కాగానే అక్కడి కేంద్రాలను మూసి వేయనున్నారు.
రైతు వ్యతిరేక విధానాలను ఎండగడదాం..
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని, రైతు వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ తీరును ఎండగట్టాలి. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదు. ధాన్యం సేకరణపై విధివిధానాలను ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నది. వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసన చేపడుతాం.