
నీటి వెతలు, కరంటు కష్టాలు, నకిలీ విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు, పెట్టుబడికి చేసిన అప్పులతో ఎవుసమంటే దండుగ అనుకున్న పల్లెలు నేడు పండుగ చేసుకుంటున్నాయి. ఒక్కరోజో, రెండు రోజులో కాదు.. ఐదు రోజుల నుంచి వేడుకను తలపిస్తున్నాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది ఇది స్వరాష్ర్టాన రైతుబంధు తీసుకొచ్చిన సంతోషం.పంటకు పెట్టుబడి పెట్టి వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై కర్షకలోకం మాటలకందని రీతిలో అభిమానాన్ని చాటుకున్నది. రేపటితో రైతుబంధు ద్వారా రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మేలు రూ.50వేల కోట్లకు చేరుతున్న సందర్భంగా ఊరూవాడ, చేను చెలకల్లో పండుగ చేస్తున్నది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని మరింత ఉత్సాహం నింపుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు శనివారం పలుచోట్ల రైతులకు సన్మానం చేశారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ముగింపు ఉత్సవాలు నిర్వహించేందుకు రైతు వేదికలను సిద్ధం చేస్తున్నారు.
రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం అత్యధికంగా లబ్ధి పొందుతున్నది. ఎనిమిదో సీజన్లో 1,232 కోట్ల రూపాయలు అందనుండగా.. మొత్తంగా రూ.7,860 కోట్లు రైతులకు చేరనున్నాయి. సోమవారంతో రైతు బంధు సాయం పంపిణీ పూర్తి కానుండడంతో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలంతా భాగస్వాములవుతూ పార్టీ శ్రేణులతో పాటు రైతు బంధు సమితి సభ్యులను, రైతులను నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు రైతుబంధు ప్రాధాన్యతను ప్రతి గ్రామంలో వివిధ రూపాల్లో చాటుతున్నారు. శనివారం ఉమ్మడి జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. వరి పొలాల్లో నారు కట్టలతో ‘జై కేసీఆర్, జై రైతు బంధు’ అని అలంకరించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. రైతులు వరి పొలాల్లో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
చేయగా మహిళలు ఇండ్ల ముంగిళ్లలో ముగ్గులు వేసి సంతోషాన్ని వెలిబుచ్చారు.