భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 5: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి భద్రాద్రి జిల్లాలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఆక్షేపణలు లేని, ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను సిద్ధం చేసి ప్రచురించినట్లు చెప్పారు. జిల్లాలోని పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో మొత్తం 9,07,909 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. వీరిలో 4,43,894 మంది పురుషులు, 4,63,986 మంది మహిళలు, 29 మంది థర్డ్ జెండర్లు, 717 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. మహిళలు, పురుషులు కలిపి పినపాక నియోజకవర్గంలో 1,85,544 మంది, ఇల్లెందు నియోజకవర్గంలో 2,06,031 మంది, కొత్తగూడెం నియోజకవర్గంలో 2,27,763 మంది, అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,46,685 మంది, భద్రాచలం నియోజకవర్గంలో 1,41,886 మంది ఉన్నట్లు వివరించారు.