బీబీనగర్, డిసెంబర్ 23 : రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సూచించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన అన్నదాతల ఆత్మీయ సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. గతంలో ప్రతిఒక్కరూ సేంద్రియ విధానంలో పంటలు పండించేవారని, ప్రస్తుతం రసాయనాలు వాడి పంటలు పండించడం వల్ల ఉపయోగం లేదన్నారు. పౌష్టికాహారానికి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. అంతకుముందు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ద్వారా వారి పండించిన విధానం, ఏ సమయంలో ఏ పంట వేస్తే బాగుంటుందని అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలు పొగాకు, సిగరెట్, మందు, పాన్ వంటి చెడు వ్యసనాల వల్ల వారి జీవితానికి ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై ఒక డ్రామాతో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల్లో గల ఆదర్శ రైతులను సన్మానించారు. అవగాహన సదస్సు వద్ద పలు కంపెనీల ఆధ్వర్యంలో వ్యవసాయానికి అవసరమయ్యే యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనూరాధ, ఎలక్షన్ మాజీ కమిషనర్ నాగిరెడ్డి, ఎంపీపీ సుధాకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, నాయకులు, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.