Vikrant Massey | ’12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సడన్‌గా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించాడు విక్రాంత్. తాను నటనకు శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తాజాగా ఖండించారు. తన మనసులోని మాటను చాలా చిన్నగా చెప్పడం వల్ల అది రిటైర్మెంట్గా పొరబడ్డారని అసలు విషయం అది కాదని స్పష్టం చేశాడు.
గత కొన్నేళ్లుగా విరామం లేకుండా సినిమాలు చేయడం వల్ల తాను తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యానని, రోజుకు దాదాపు 16 గంటల పాటు కష్టపడటం వల్ల శారీరకంగా, మానసికంగా కొంత అలసట వచ్చిందని విక్రాంత్ వివరించాడు. ఈ క్రమంలోనే భర్తగా, తండ్రిగా తన కుటుంబానికి క్వాలిటీ టైమ్ ఇవ్వాలని భావించానని, అందుకే సినిమాల నుంచి చిన్న విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు.
గత 2024 డిసెంబర్లో 2025లో వచ్చే సినిమాలే నా చివరివి అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే తాను నటనను వదిలిపెట్టడం లేదని, కేవలం రీఛార్జ్ అవ్వడానికి మాత్రమే దూరంగా ఉంటున్నానని చెప్పడంతో ఫ్యాన్స్ తాజాగా ఊపిరి పీల్చుకుంటున్నారు.