
నింగిలోని చుక్కలన్నీ లోగిళ్లలో ముగ్గులు వేసినట్లు అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కరోనా కాలంలోనూ కర్షకులకు పెట్టుబడి సాయం అందించి వారికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఊరూరా రైతు బంధు సంబురాలు నిర్వహిస్తున్నారు. రైతు బాంధవుడికి క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నదాత వెన్నంటే నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు బంధు వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం రైతులు, మహిళలు రైతు వేదికలు, మార్కెట్ ఆవరణల్లో జై రైతుబంధు, జై జై కేసీఆర్ అంటూ ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. పలుచోట్ల వడ్లు, మిర్చి, పత్తి పంటలతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పంటాభిషేకం చేసి వినూత్నంగా సంబురాలు జరుపుకొన్నారు.
ఖమ్మం, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు రైతులకు పండుగ తీసుకువచ్చింది. సాగు సాఫీగా సాగేందుకు దోహదం చేసింది. పెట్టుబడి సాయం అందిస్తున్నందుకు ఉమ్మడి జిల్లావాప్తంగా రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు. రైతులు, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేటలో పొలాల వద్ద మహిళా రైతులు రంగులు చల్లుకుంటూ సంబురాలు నిర్వహించారు. తోటల్లో పూసిన పూలతో సీఎం చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. రఘునాథపాలెం మండలంలోని కోయచెలకకు చెందిన రైతులు మిర్చితో ‘రైతుబంధు’ అక్షరమాల ఏర్పాటు చేశారు. బస్వాపురం రైతువేదికలో జరిగిన వేడుకలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. రైతులను టీఆర్ఎస్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. మధిరలోని భరత్ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ‘జై కేసిఆర్.. జై రైతుబంధు’ అనే అక్షర మాలతో నించున్నారు. జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొని మాట్లాడారు. రైతుబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. టేకులపల్లి మండలంలోని కోయగూడెం రైతువేదికలో రైతులు సంబురాలు నిర్వహించారు. ఎంపీపీ భూక్యా రాధ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శ్యామ్ పాల్గొన్నారు. చండ్రుగొండ మండలంలో నిర్వహించిన సంబురాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో నిర్వహించిన వేడుకలో మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతుబంధుతో రైతులు అప్పుల ఊబి నుంచి గట్టెక్కారన్నారు. అనంతరం రైతులతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్నపురెడ్డిపల్లి రైతులు వ్యవసాయ క్షేత్రంలో వరి పనలతో ‘జై కేసీఆర్’ అక్షర మాల ఏర్పాటు చేశారు. తల్లాడలో జరిగిన వేడుకలో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దమ్మపేట, కామేపల్లి, కారేపల్లి, కొణిజర్ల మండలం లింగగూడెం, దుమ్ముగూడెం, పర్ణశాల, బూర్గంపహాడ్, గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు తదితర ప్రాంతాల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి.