e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News రైతు చెంతకే.. సమాచారం

రైతు చెంతకే.. సమాచారం

  • నేరుగా ఫోన్లకే సమాచారం
  • వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరో ముందడుగు
  • పంటల సాగు, మందులు, ఎరువుల వాడకంపై అన్నదాతల ఫోన్లకు మెసేజ్‌లు
  • పంటల నమోదు ఆధారంగా సూచనలు, సలహాలు..
  • ఇతర పంటల సాగును పెంచేందుకు పల్లెబాట పట్టిన అధికారులు
  • ప్రత్యక్షంగా రైతులను కలిసి లాభనష్టాలపై అవగాహన

యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర సర్కార్‌ అన్నదాతలకు అండగా నిలిచేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. భూసారం, పంటల సాగు, చీడపీడల నివారణ తదితర సమాచారం నేరుగా రైతులకే అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఏ కాలంలో ఏ పంటలు వేయాలి.. ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. ఏ మందులు పిచికారీ చేయాలనే అంశాలపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అన్నదాతల సెల్‌ఫోన్లకు సమాచారం పంపించనున్నారు. పంటల నమోదు ఆధారంగా ఆయా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నారు. మరోవైపు యాసంగిలో ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ఉమ్మడిజిల్లా వ్యవసాయ అధికారులు పల్లెబాట పట్టారు. గ్రామాల్లోని రచ్చబండ, టీస్టాళ్లు, హోటళ్లు, చౌరస్తాలు, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి, ఇతర పంటల సాగు వల్ల కలిగే లాభనష్టాలను వివరిస్తున్నారు. పప్పు, నూనె దినుసులు, కూరగాయల సాగు చేసి తక్కువ సమయంలో అధిక లాభాలు పొందాలని సూచిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంరూరల్‌/వికారాబాద్‌, డిసెంబర్‌ 8 : అన్నదాతలు లాభదాయకమైన పంటలు సాగు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు నడుం బిగించారు. రైతులను ఒకచోట చేర్చి సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించేవారు. కానీ, ఇప్పుడు సమావేశాలపై ఆసక్తి చూపని రైతుల వద్దకే నేరుగా వ్యవసాయ అధికారులు వెళ్లి ఆరుతడి పంటలు సాగు చేస్తే వచ్చే లాభాలను వివరిస్తున్నారు. గ్రామాల్లోని రచ్చబండ, టీస్టాళ్లు, హోటళ్లు, చౌరస్తాలు, పొలాల వద్దకు వెళ్లి సాగు విధానాలను చెబుతున్నారు. గత సీజన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో వరి సాగు తగ్గించి.. ఇతర పంటలను వేసుకునేలా రైతులను సమాయత్తం చేస్తున్నారు. మూసధోరణిలో వరి సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గుతున్నది. ఈ తరుణంలో పెసర్లు, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, బెబ్బెర్లు, మినుములు, కూరగాయల పంటలను సాగు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌ ఉన్న కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశమున్నందున కూరగాయల పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -

గ్రామాల్లో విస్తృత అవగాహన..

వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఐదుగురు ఏడీఏలు, 22 మంది మండల వ్యవసాయ అధికారులు, 80 మంది వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారులు పల్లె బాట పట్టారు. ప్రత్యేక సమావేశాలతో పాటు నలుగురు, ముగ్గురు ఉన్నచోటకు వెళ్లి ఇతర పంటల వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలను క్రాప్‌కాలనీల కింద ఎంపిక చేసి కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. కూరగాయలు సాగు చేస్తే నగరానికి తరలించి అధిక లాభాలు గడించేందుకు అవకాశమున్నందున కూరగాయలతో పాటు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా అధికారులు కృషి చేస్తున్నారు.

రైతు ఫోన్‌కు మెసేజ్‌తోఅవగాహన..

ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఎరువులు, మందులు ఏమేమి వేయాలి అన్న విషయాలపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల సమావేశాలకు రాని రైతులకు సలహాలు, సూచనలు అందేలా ప్రభుత్వం చూస్తున్నది. తెగుళ్లు, చీడపీడలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులను వారి సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ చేయనున్నారు. ప్రతి రైతు పంట నమోదు చేసుకోవడం చాలా అవసరం.

పకడ్బందీగా సర్వే..

సిద్దులూర్‌ క్లస్టర్‌ పరిధిలో కూరగాయలు, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌, ఉలువలు, కుసుమలు, శనగ తదితర పంటలు సాగు చేస్తున్నారు. నేరుగా పొలాల వద్దకు వెళ్లి సర్వే చేసి, ఏ పంట వేశారో నమోదు చేసుకుంటున్నాం. ఎలాంటి మందులు వాడాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నేరుగా రైతుల సెల్‌ఫోన్‌కు సమాచారం అందించనున్నాం.

  • సి.కావ్య, ఏఈవో, సిద్దులూర్‌ క్లస్టర్‌, వికారాబాద్‌

సెల్‌ ఫోన్‌ మేసేజ్‌తో అవగాహన..

ఏ పంటలు వేయాలి, ఎంత మోతాదులో ఎరువులు, మందులు పిచికారీ చేయాలనే సమాచారం రైతుల సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ పంపించేలా వ్యవసాయ శాఖ ఆలోచన చేస్తున్నది. ఏ నేలలో ఏ పంట వేయాలి, తెగుళ్లు, చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలనే తెలియజేయనున్నాం. వ్యవసాయ శాఖ నుంచి నేరుగా రైతుల ఫోన్‌లకు మేసేజ్‌లు రానున్నాయి.

  • రమేశ్‌, మండల వ్యవసాయాధికారి, వికారాబాద్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement