-వెల్గటూర్, డిసెంబర్ 22 : కంపెనీ విస్తరణలో భాగంగా ధర్మపురి ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమను త్వరలోనే ఏర్పాటు చేస్తామని క్రిభ్కో కంపెనీ చైర్మన్ డా చంద్రపాల్ సింగ్ ప్రటించారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి శివారులోని 1091 సర్వే నంబర్లో కంపెనీ ఏర్పాటుకు మంత్రి కొప్పుల ఈశ్వర్, డైరెక్టర్లు, కలెక్టర్ రవి, ఇతర అధికారులతో కలిసి మంగళవారం ఆయన స్థల పరిశీలన చేశారు. ఏడాదికి ఎనిమిది కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని స్థాపిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ధాన్యం, మక్క ఎక్కువ సాగు కావడం, పుష్కలమైన నీరు ఉండడం, రోడ్డుతోపాటు దగ్గరలో మంచిర్యాల, పెద్దపల్లి రైలు మార్గాలు అందుబాటులో ఉండడం కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. దగ్గరలోనే రామగుండం ఎరువుల తయారీ కంపెనీ కూడా ఉండడం కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రిభ్కో కంపెనీ వైస్ చైర్మన్ సునీల్‌కుమార్ సింగ్, డైరెక్టర్లు బిజేంద్రసింగ్, పొన్నం ప్రభాకర్, వీఎస్ఆర్ ప్రసాద్, డీపీ రెడ్డి, ప్రాజెక్టు ఇన్చార్జి రాంరెడ్డి, అడిషనల్ కలెక్టర్ మాధురి, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కంపెనీ ఏర్పాటైతే మన ప్రాంతం అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నది. ఇది మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అదృష్టం. ఇది ఏర్పాటైతే మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతయ్. వరి, మక్క, నూకలతో ఇథనాల్ తయారవుతుంది. మన రైతులకు వరి, మక్క ఎక్కడ అమ్ముకోవాలన్న ఆందోళన ఉండదు. కంపెనీ ఏర్పాటుకు స్థానికులంతా సహకరించాలి.