పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, డిసెంబర్ 22: క్రిస్టియన్లకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నామని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. దీనికి భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా పలు చర్చిల పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకొన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ గిఫ్ట్‌లను క్రైస్తవులకు భూపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి అందజేశారు. అనంతరం ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రజలందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. అన్ని మతాలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తుండటం అభినందించదగ్గ విషయమన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలో అనేక చర్చిలకు ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. గుడులు, చర్చిలు, మసీదులకు ఎమ్మెల్యే సాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 250 చర్చిలున్నాయన్నారు. ఏటా కేక్‌లు, గ్రీటింగ్స్ అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అన్ని మతాలను గౌరవించి, అధికారికంగా పండుగలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జోనల్ కమిషనర్ ప్రియాంక, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ కుంచాల ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, రోజాబాల్రెడ్డి, అఫ్జల్, విజయ్‌కుమార్, పరమేశ్, ఫాదర్లు జాషువ, యాదయ్య, దినకర్, అబ్రహం, జేమ్స్, పీటర్, జార్జ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.