గజ్వేల్ రూరల్, డిసెంబర్ 11: కాలానికనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలు తెచ్చి మరింత బలోపేతం చేస్తున్నది. అన్ని మౌలిక వసతులు కల్పించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నది. ఇందుకోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నది. దీంతో అంగన్వాడీలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగి, తమ పిల్లలను కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి రెండు సార్లు వేతనాలు పెంచి అండగా నిలబడిన సర్కారు, ప్రస్తుతం విద్యార్థులకు ఆంగ్లంలో బోధన చేస్తూ వారి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నది. కాగా, నేటి పోటీ ప్రపంచంలో వారి బంగారు భవిష్యత్‌కు అంగన్వాడీలు బలమైన పునాది వేస్తున్నాయంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 1150 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిల్లో 49,700 మంది చిన్నారులు, 12వేల మంది బాలింతలున్నారు. అలాగే, గజ్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 274 కేంద్రాలుండగా అందులో 8 వేల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులను ఆకట్టుకునేలా వివిధ రకాల బొమ్మలు, ఆటవస్తువులతో బోధి స్తూ వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు టీచర్లు కృషి చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసి ఆరోగ్య పరిరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి వరకు అరకొర జీతాలతో పనిచేసిన సిబ్బందికి సీఎం కేసీఆర్ రెండు సార్లు వేతనాలు పెంచి భరోసా కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీచర్లకు నెలకు రూ.4200 ఉండగా రెండు సార్లు వేతనాలు పెంచడంతో రూ.13, 650లకు పెరిగింది. ఆయాలకు రూ.2250 ఉండగా, రూ.7800 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది.
ఆంగ్ల బోధన…
విద్యార్థులను ఆధునిక సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులతోనే భవిష్యత్ బాగుంటుందనే భావన ఉండడంతో వారి ఆకాంక్షల కనుగుణంగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అనేక కేంద్రాల్లో ఆంగ్ల మాద్యమ పుస్తకాలను అందజేసింది. దీంతో మూడు నుంచి ఐదు ఏండ్ల్లలోపు చిన్నారులకు సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన విజయవంతంగా కొనసాగుతున్నది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ ప్లే స్కూల్ల నుంచి తీసి ఇక్కడ చేర్పిస్తుండడంతో అంగన్వాడీల్లో సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. టీచర్లు, విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్త్రీ శిశు సంక్షేమశాఖ కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నది.
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ…
ఐసీడీఎస్ చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నది. చదువులో వెనుకబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య కూడా పెరుగుతున్నది. రక్తహీనత, బరువు తక్కువ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. పోషణ్ అభియాన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు.
నూతన ఒరవడి కనిపిస్తున్నది..
అంగన్వాడీ కేంద్రాల్లో నూతన ఒరవడి కనిపిస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న కృషితో తమ పిల్లలను కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం టీచ ర్లు, ఆయాలకు రెండుసార్లు వేతనాలు పెంచడంతో వారిపై మరిం త బాధ్యత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఆంగ్లంలో ఆకట్టుకునేలా బోధన చేస్తున్నారు.
ఆంగ్ల బోధనపై ఆసక్తి
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభు త్వం ఆంగ్ల మాద్యమ పుస్తకాలను అందించడంతో ఇంగ్లిష్‌లోనే బోధిస్తున్నాం. పుస్తకాలు, ఆట వస్తువులతో చిన్నారులను ఆకట్టుకునేలా రోజూ బోధన చేస్తున్నాం. సర్కారు ఇస్తున్న ప్రోత్సాహంతోనే అంగన్వాడీలు బలోపేతం అవుతున్నాయి.