Fenugreek Seeds | మన వంటగదిలో ఉండే అనేక రకాల దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. వీటిని మనం అనేక రకాల వంటకాల్లో వాడుతూ ఉంటాం. మెంతులు వేయడం వల్ల వంటలకు ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. మెంతులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. మెంతుల్లో కరిగే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ ను శరీరం నెమ్మదిగా శోషిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా మెంతులల్లో 4- హైడ్రాక్సీఐసోలూసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతులను నానబెట్టి లేదా భోజనంలో కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇతర ఆహారాలతో కలిపి మెంతులను తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మెంతులను నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరాయిడ్స్ కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మెంతి గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తీసుకునే ముందు అందులో దాల్చిన చెక్క పొడి వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అదే విధంగా తాజా ఉసిరి రసంలో మెంతి గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక ఫలితాలను పొందవచ్చు. ఉసిరిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరచడంలో, గ్లూకోజ్ జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. రోజూ ఒక గ్రాము ఉసిరి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల గ్లూకోజ్, సీపిఆర్ సాంద్రతలు మెరుగుపడతాయి.
ఇక అవిసె గింజలను, మెంతి గింజలను కలిపి తీసుకోవడం వల్ల చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. భోజనం తరువాత చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులు తగ్గుతాయి. అవిసె గింజలను, మెంతులను కలిపి తీసుకోవడం వల్ల 24 గంటలకు పైగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా నమోదయ్యాయని పరిశోధనల్లో వెల్లడైంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. పాన్‌కేక్స్, మఫిన్స్ వంటి వాటి తయారీలో అవిసె గింజలను, మెంతులను వేసి తయారు చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే పసుపును, మెంతులను కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పసుపులోని కర్కుమిన్ ఇన్సులిన్ నిరోధకతను, హైపర్ గ్లైసీమియా, హైపర్ లిపిడెమియా వంటి మధమేహ సంబంధిత సమస్యలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. గోరు వెచ్చని పాలల్లో లేదా నీటిలో పసుపు, మెంతి గింజల పొడి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వంటల్లో కూడా పసుపు, మెంతి గింజల పొడి వేసి తీసుకోవచ్చు. ఈ విధంగా మెంతి గింజలను ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.