Supreme Court : ఏ మహిళను కూడా తాము ఇష్టంలేని గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అవాంఛిత గర్భధారణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈవిధంగా స్పందించింది. తనకు ఇష్టం లేకపోయినా గర్భం కొనసాగించాలని తాము ఏ మహిళను ఒత్తిడి చేయలేమని పేర్కొంది. మైనర్ (Minor) గా ఉండి గర్భవతి అయిన ఓ బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసింది. దాంతో గర్భవిచ్ఛిత్తికి ఆమెకు అనుమతినిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గర్భవిచ్ఛిత్తికి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది.
కాగా మహారాష్ట్రకు చెందిన ఓ మైనర్ బాలిక స్నేహితుడితో సంబంధం కారణంగా కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. ప్రస్తుతం ఆమె వయసు 18 సంవత్సరాల నాలుగు నెలలు. ఇప్పుడు ఆమె 30 వారాల గర్భిణిగా ఉంది. ఈ క్రమంలో గర్భవిచ్ఛిత్తి కోసం అమ్మాయి తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గడువు మించిపోవడంతో కోర్టు అందుకు నిరాకరించింది.
దాంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. గర్భిణి నిర్ణయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా గర్భధారణ కొనసాగింపుపై అయిష్టత వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆమె స్వేచ్ఛకు వదలివేయాలని సూచించింది. అయితే ఈ కేసులో పిండం కూడా ఒక ప్రాణమే అయినప్పటికీ మరో మార్గం లేదని పేర్కొంది. ఎంటీపీ చట్టం ప్రకారం గడువు ముగిసినప్పటికీ గర్భవిచ్ఛిత్తి జరుగుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇలాంటి సందర్భాల్లో బాధితులు ఎక్కడికి వెళ్తారనే ప్రశ్నను ధర్మాసనం లేవనెత్తింది. నకిలీ, అనధికార వైద్యుల వద్దకు వెళ్తారని, అది మరింత ప్రమాదకరమని చెప్పింది. ఈ కేసులో గర్భవిచ్ఛిత్తికి అనుమతించినా అమ్మాయికి ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది.