గజ్వేల్, డిసెంబర్ 15 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కూడళ్లు, రహదారులు నూతన హంగులను సంతరించుకుంటున్నాయి. హుడా ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సుందరీకరణ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు పట్టణాన్ని మరింత అందంగా ముస్తాబు చేస్తున్నారు. మొదటి దశలో గజ్వేల్ పట్టణంలోని నాలుగు కూడళ్లను కోటి రూపాయల మున్సిపల్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తా, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ కూడలి, తూప్రాన్, సంగుపల్లి, గజ్వేల్ కూడలి మధ్య పనులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ భవనం ప్రారంభ కార్యక్రమంలో సిద్దిపేట కూడళ్ల మాదిరిగా గజ్వేల్‌ను కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్, ఇందిరాగాంధీ కూడళ్లను గ్లాస్ గ్రాస్, అలంకరణ మొక్కలతో తీర్చిదిద్దనున్నారు. తూప్రాన్, సంగుపల్లి గజ్వేల్ వై జంక్షన్ వద్ద బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం ఉండగా, సరిగ్గా కూడలి మధ్యలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. జాలిగామ బైపాన్ కూడలి వద్ద మిషన్ భగీరథ స్ఫూర్తిని కలిగించేలా కూడలిని ఏర్పాటు చేస్తున్నారు.
హుడా సహకారంతో రింగురోడ్డుపై హరిత సుందరీకరణ..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తున్నది. దీంతో అభివృద్ధి చేయడంతో పాటు అందంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు హుడా ద్వారా గజ్వేల్‌లో సుందరీరకరణ పనులు చేపట్టాలని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇం దుకు స్పందించిన హుడా రాజీవ్ రహదారి, రింగురోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రాజీవ్ రహదారిపై, పట్టణంలోని రహదార్ల డివైడర్లపై ఉన్న చెట్లను వివిధ ఆకృతులుగా మలుస్తున్నారు. అలాగే, డివైడర్లపై వృక్షా లు ఏపుగా పెరుగగా వాటికి ఇరువైపులా అలంకరణ మొక్కలు నాటుతున్నారు. రింగురోడ్డులోని ధర్మారెడ్డిపల్లి, జాలిగామ రహదారుల కూడళ్లలో, డివైడర్లపై పూర్తిగా హరితహారం స్ఫురించేలా మొక్కలు నాటుతున్నారు. రైల్వేస్టేషన్ మార్గంలో ఇప్పటికే అలంకరణ పూర్తయింది.
సీఎం ఆలోచనలకు అనుగుణంగా..
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతాం. దీనిలో భాగంగానే గజ్వేల్‌లో ప్రస్తుతం ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నాం. అందంగా ము స్తాబు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పాండవుల చెరువుపై కూడా త్వరలో సుందరీకరణ పనులు నిర్వహిస్తాం.
స్వచ్ఛత, శుభ్రతతో పాటు అలంకరణ చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో స్వచ్ఛత, పా రిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. అలాగే, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కూడా మున్సిపల్ నిధులతో చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కూడళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాలుగు కూడళ్ల అభివృద్ధి తర్వాత మరిన్ని కూడళ్లను కూడా అం దంగా మార్చేందుకు కౌన్సిల్లో చర్చించి చర్యలు చేపడుతాం.
-వెంకటగోపాల్, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్