ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చే డ్రైవరన్న అలిసిపోతున్నాడు. 8 గంటల పనిదినాన్ని తుడిచేసి.. 15 గంటలు విధులు నిర్వర్తించాలనే ఆర్టీసీ యాజమాన్య షరతులతో నలిగిపోతున్నాడు. తను కూడా ఓ మనిషినేనని గుర్తించని ఆ యాజమాన్య విధానాల ఒత్తిడికి స్టీరింగ్ పట్టాలంటే జంకుతున్నాడు. తన వల్ల కాదని.. తనకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని విన్నవించుకున్నా.. ఉన్నతాధికారుల నుంచి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. గ్రేటర్లో పని ఒత్తిడి కారణంగా డ్రైవర్లు అధిక రక్తపోటు, వినికిడి, దృష్టి, బ్రెయిన్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఏకథాటిగా 12-15 గంటల వరకు బస్సులు నడపాల్సి వస్తుండటంతో మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)
ఆర్టీసీ ఆసుపత్రుల్లో చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. కొందరు డ్రైవర్లకు హార్ట్‌లో స్టెంట్స్ కూడా వైద్యులు అమర్చారు. అయినా వారితోనే ఇప్పటికీ బస్సులను నడిపిస్తున్నారు. తాను నడపలేనని చెస్ట్ పెయిన్ వస్తున్నదని విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ డ్రైవర్ మార్గమధ్యలో ఛాతీ నొప్పితో రావడంతో రోడ్డుపై బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. ఆ ఘటనలో డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. హయత్‌నగర్ డిపోకు చెందిన ఓ డ్రైవర్‌కు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు హార్ట్‌లో స్టెంట్స్ పడ్డాయి. అయితే అతడిని ఇప్పటికీ కూడా బస్సును నడపాల్సిందేనని అధికారులు చెబుతున్నారని అంటున్నాడు. రాణిగంజ్ డిపోకు చెందిన డ్రైవర్‌కు బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడు. అతడు కూడా ఇప్పుడు బస్సు నడుపుతూనే ఉన్నాడు. గ్రేటర్లో ఇలా డిపోల వారీగా చాలా మంది డ్రైవర్లు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. వీరిని ప్రత్యేక కేటగిరీ కింద పరిశీలించి మరో డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తే శ్రేయస్కరమని ఆర్టీసీ యూనియన్ డిమాండ్ చేసింది.
గతంలో గ్రేటర్లో ఆర్టీసీ మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 3,200 బస్సులపైనే ఆధారపడి ఉంది. రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని, మరో 7వేల బస్సులు సమకూర్చాల్సినఅవసరముంది.అంత అవసరం ఉన్నా..ఉన్న డ్రైవర్లతోనే విశ్రాంతి ఇవ్వకుండా ట్రిప్పులు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
8 గంటలు పనిచేస్తేనే అలిసిపోతాం. మహాలక్ష్మి పథకం తర్వాత 15 గంటల వరకు బస్సులు నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి దారణంగా ఉంది. కనీసం సెలవులు కూడా మంజూరు చేయడం లేదు. వారి ఆరోగ్యం క్షీణించిపోతున్నది. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అవసరమైన డ్రైవర్లను భర్తీ చేసుకోవాలి.
– థామస్‌రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నేత