అంబర్పేట : బస్తీల్లో మౌళిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని తులసీరాంనగర్ (లంక)లో మంగళవారం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
బస్తీలో వీధీ దీపాలు సరిగ్గా వెలగని కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు చేసిన తరువాత సీసీ రోడ్డుకు మరమ్మతులు చేయలేదని, లోఫ్రెషర్తో మంచినీరు సరఫరా అవుతుందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో టైల్స్ వేయాలని, విద్యార్థులకు నీటి వసతి కోసం బోరింగ్ వేయాలని తెలిపారు.
సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వాటర్వర్క్ మేనేజర్ రోహిత్, ఎలక్టికల్ ఏఈ సౌమ్య, టీఆర్ఎస్ పార్టీ గోల్నాక డివిజన్ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.