గజ్వేల్, డిసెంబర్ 20: రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రిస్టియన్ భవనాన్ని గజ్వేల్‌లోనే నిర్మించామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పట్టణంలో రూ.1.50కోట్ల గడా నిధులతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధితో పాటు క్రైస్తవులు, ముస్లింలను గౌరవిస్తూ వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గజ్వేల్‌లో నిర్మించిన క్రిస్టియన్ భవన్‌తో పాటు శ్రీగిరిపల్లిలో గతంలోనే ఐదు ఎకరాల్లో శ్మశానవాటికను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. బతుకమ్మ, రంజాన్‌లాగే క్రిస్మస్ పండుగకు బట్టలను పంపిణీ చేస్తున్నామని, పంపిణీ కార్యక్రమాన్ని పాస్టర్లు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అలాగే, నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షుడు రూబెన్ కోరిక మేరకు క్రిస్టియన్ భవనంలో కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనాన్ని కూడా అందిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులను ఏమాత్రం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తూ గౌరవిస్తున్నదని, అలాగే క్రిస్టియన్లంతా తమకు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.20 లక్షల నిధుల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న క్రిస్టియన్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు రూబెన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎంపీపీ అమరావతి, కౌన్సిలర్లు బబ్బూరి రజిత, శ్యామల, డీఆర్డీవో గోపాలరావు, బాలేశ్, ‘గడా’ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, పాస్టర్లు రూ బెన్, యాకూబ్, బాపురెడ్డి, జయంత్, క్రిస్టోఫర్, జేమ్స్, యోహాన్, మాణిక్యరావు, క్రైస్తవులు పాల్గొన్నారు.