‘ఇచ్చింది తీసుకపోదు..కొత్తగా కొనదు’.. ఈ డైలాగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సరిగ్గా సూటవుతుంది. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద రోజుల తరబడి బియ్యం దిగుమతి చేసుకోక పోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి వెళ్లిన బియ్యం లారీలు రోజుల తరబడి అక్కడే నిలిచి ఉంటున్నాయి. దీంతో మన జిల్లా నుంచి బియ్యం లోడ్లతో వెళ్లిన లారీల డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. రైల్వేశాఖ సమయానికి వ్యాగన్లు పంపడం లేదు. దీంతో ఎఫ్‌సీఐ గోదాముల నుంచి బియ్యం ఎగుమతులు అనుకున్న మేర సాగడం లేదు. తద్వారా ఎఫ్‌సీఐ గోదాములు బియ్యం బస్తాలతో నిండిపోయాయి. జిల్లాల నుంచి లారీల్లో పంపుతున్న బియ్యాన్ని అక్కడ దించుకోవడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం బియ్యం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న ఈ కుట్రలను రైతులు గమని స్తున్నారు. తగిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా నుంచి రోజుకు సుమారుగా 2,175 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లా నుంచి 1500 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి జిల్లా నుంచి 725 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించే సామర్ధ్యం ఉంది. అయినప్పటికీ కేవలం సగం మాత్రమే ఎఫ్‌సీఐ గోదాముల వద్ద దిగుమతి అవుతున్నాయి. గోదాముల వద్ద స్థలం లేక, వ్యాగన్లు రాక స్థలం సరిపోవడం లేదు. మన బియ్యాన్ని జనగామ జిల్లాలోని వడ్లకొండ, వంగపల్లి, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హైదరాబాద్‌లోని చర్లపల్లి, సనత్‌నగర్ తదితర ఎఫ్‌సీఐ గోదాములకు పంపిస్తున్నారు. ఆయా జిల్లాల నుంచి ఈ ఏడు నెలల కాలంలో నలభై నుంచి యాభై శాతం వరకు లక్ష్యాన్ని చేరుకున్నది. రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని బియ్యం చేసి అందివ్వడానికి సిద్ధ్దంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా మూలంగా అనుకున్న లక్ష్యాన్ని చేరడం లేదు.
ప్రభుత్వ చేయూతతో గణనీయంగా పెరిగిన వరి సాగు…
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేండ్ల నుంచి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, సాగుకు పుష్కలంగా నీరు ఇస్తుండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా పంటలు పండుతున్నాయి. మన రైతులు రికార్డు స్థాయి వడ్లు పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. వానకాలానికి సంబంధించి మెదక్ జిల్లాలో వందశాతం ధాన్యం సేకరణ పూర్తయింది.సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో నేడో రేపో వందశాతం పూర్తి కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం జిల్లాల నుంచి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తెలంగాణ ప్రభుత్వం పంపిస్తున్నది. ఇది చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, ఏదోరకంగా కొర్రీలు పెట్టి యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నది. మే నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీలతో బియ్యం దిగుమతులు కేవలం నలభై నుంచి యాభై శాతం వరకే ఎగుమతి అయ్యాయి. సరిగ్గా వ్యాగన్లు పంపక. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద స్థలం లేకపోవడం, గోదాములు నిండుగా ఉండడం ఇవన్నీ కారణాలు చెప్పవచ్చు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో గత యాసంగిలో 5,43,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు గాను 3,69,240 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడు నెలల కాలంలో సుమారుగా 1,94,270 మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేశారు. ఇంకా 1,72,384 మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేయాల్సి ఉంది. బియ్యం రెడీగా ఉన్నప్పటికీ, గోదాముల వద్ద దిగుమతులు కాకపోవడంతో యాభై శాతం మేర మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. రోజుకు 75 ఏసీకేలు ఎగుమతి చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ, గోదాముల వద్ద దిగుమతులు లేక పోవడంతో కేవలం 35 నుంచి 40 ఏసీకేలు మాత్రమే వెళ్తున్నాయి. రోజుకు 2175 మెట్రిక్ టన్నుల ఎగుమతికి గాను, కేవలం 1300 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు.
రైతులను మోసం చేస్తున్నన్న బీజేపీ ప్రభుత్వం ..
రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలనే బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తున్నది. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద లారీలు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వానికి కనబడడం లేదా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని తరలించలేక, గోదాములు ఖాళీ చేయక పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన మాట వాస్తవం కాదా ? బీజేపీ నాయకులు అబద్ధ్దాలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ర్టాలపై నెపం నెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నది.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో గత యాసంగిలో 4,30,355 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను 2.92 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా, ఏడు నెలల కాలంలో 81,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. రోజుకు 1500 మెట్రిక్ టన్నుల సామర్థం ఉన్నప్పటికీ, అలా ఎగుమతులు కావడం లేదు.
కేంద్రం కపట నాటకం..
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతున్నది. మెదక్ జిల్లా నుంచి ప్రతిరోజు 1250 నుంచి 1500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపుతున్నారు. నెలకు 40వేల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవాల్సి ఉండగా, 15వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటున్నారు. బియ్యం నిల్వలకు స్టోరేజీ లేకనే కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. జిల్లా నుంచి ఏడు నెలల కాలంలో 2.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవాల్సి ఉండగా, కేవలం 92వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తీసుకున్నది.
-సోములు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, మెదక్
కేంద్ర సర్కారు కొనాలి..
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనక పోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. ధాన్యాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నా కేంద్ర మంత్రులకు బుద్ధి వస్తలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేం ద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనిపించాలి. లేకుంటే కేంద్రానికి రైతుల ఉసురు తగులుతుంది. మేము పండించిన వానకాలం వడ్లను తెలంగాణ సర్కారు కొన్నది.
-దండు దుర్గేశ్, రైతు, చిన్నఘనపూర్, మెదక్