చెత్త పనికిరాని పదార్థం.. కంపుకొట్టే వ్యర్థం.. ఇదంతా గతం.. ఎన్నో నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఇప్పుడు చెత్తతో సంపద సృష్టిస్తున్నది. దీంతో పట్టణంలోని చెత్త ఎక్కడ వేయాలి, ఏం చేయాలనే రంది బల్దియాకు లేకుండా పోయింది. ఇప్పటికే పొడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తుండగా, ఇప్పుడు తడి చెత్తతో బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా సీఎన్జీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నారు. రూ.6 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ రాష్ట్రంలో మొదటిది కావడం విశేషం. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో బయో గ్యాస్ ప్లాంట్‌ను నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 19 : స్వచ్ఛతలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా వినూత్నమైన కార్యక్రమాలకు వేదికవుతున్నది. పర్యావరణహితం కోసం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో సేకరించిన తడి చెత్తను బుస్సాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న బయోగ్యాస్ ప్లాంట్‌కు తరలించి, సీఎన్జీ గ్యాస్‌ను తయారుచేసే విధంగా ప్లాంట్‌ను రూ.6కోట్లతో నిర్మించారు. ఈ ప్లాంట్‌ను నేడు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
మున్సిపాలిటీకి ఆదాయం..
సిద్దిపేట మున్సిపాలిటీ అనేక విభిన్నమైన ఆలోచనలు, నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్తను వేరు చేయడంతో పాటు చెత్తతో సంపదను ఎలా సృష్టించవచ్చో నేర్పుతున్నది. ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి ఇవ్వడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో తడిచెత్తతో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూర్ తరహాలో సిద్దిపేటలోను సీఎన్జీ గ్యాస్ తయారీ ప్లాంట్‌ను నిర్మించారు. పొడి చెత్తను డీఆర్సీసీ సెంటర్‌కు, తడి చెత్తను బుస్సాపూర్‌కు తరలించి గ్యాస్ తయారీ చేయనున్నారు. ఇది బెంగళూర్ తరువాత భారతదేశంలో రెండో ప్లాంట్ కాగా, రాష్ట్రంలో మొట్టమొదటిది. మంత్రి హరీశ్‌రావు దిశా నిర్దేశంలో అనేక మైలురాళ్లను అందుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ నేడు మరోమారు తడిచెత్తతో బయోగ్యాస్ తయారు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సిద్దిపేట పట్టణంలో నిత్యం 40వేల కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. దీంతో ప్రతిరోజు మున్సిపల్ ఆధ్వర్యంలోని పారిశుధ్య వాహనాలు ఇంటింటా తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాయి. సిద్దిపేట పట్టణంలో రోజూ 25 నుంచి 30 లక్షల టన్నుల తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా ఇంటింటా సేకరించిన చెత్తను బయోగ్యాస్ ప్లాంట్‌కు తరలించి చెత్తను క్రషింగ్ చేస్తారు. అనంతరం పైపు ద్వారా ఫ్రీడిజెస్టర్ అనే ట్యాంకులోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో ఉన్న మరో ట్యాంకులోకి పంపి అందులోకి ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంకులో మైక్రో ఆర్గాన్లను వేస్తారు. దీంతో ఆ ప్లాంట్ విడుదలయ్యే మిథెన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరు చేసి సిలిండర్లుగా నింపుతారు. ఇలా సీఎన్జీ గ్యాస్ తయారీ ద్వారా వచ్చే డబ్బులను మున్సిపల్ అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణను కార్బన్లైట్స్ ఇండియా కంపెనీ బాధ్యతలు నిర్వర్తించనున్నది.
ప్రజల భాగస్వామ్యానికి సత్ఫలితం..
దేశంలోనే తడి చెత్తతో సీఎన్జీ గ్యాస్ తయారు చేసే రెండో బయోగ్యాస్ ప్లాంట్‌ను సిద్దిపేటలో నిర్మించి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. అభివృద్ధికి ప్రజల తోడ్పాటు, భాగస్వామ్యమైతే సత్ఫలితాలు వస్తాయనడానికి ఈ ప్లాంట్ నిర్మాణం నిదర్శనం. ప్రజల భాగస్వామ్యంతోనే తడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులో ఎరువులుగా తయారు చేయడంలో తొలి అడుగు వేశాం. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తతో గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. తడి చెత్తతో గ్యాస్ తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పనితీరుకు ఫలితం.
-,హరీశ్‌రావు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి