
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 12: బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు 12 రకాల ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం సమ్మెకు దిగారు. నగరంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు, ప్లకార్డుల నిరసన వ్యక్తం చేశారు. నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యుగల్ రాయలు ముఖ్య అతిథిగా హాజరై సమ్మెకు మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1.75 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జన్‌ధన్, ముద్ర తదితర పథకాల సక్సెస్‌లో ప్రభుత్వ బ్యాంకులే ప్రధాన పాత్ర పోషించాయని గుర్తుచేశారు. అంతటి ప్రాధాన్యమున్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే పేదలు, మధ్య తరగతి ప్రజలకే ఎక్కువ నష్టమని అన్నారు. ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ బ్యాంకుల సమ్మె ఉద్యోగుల కోసం కాదని, దేశ జాతి అవసరాల కోసమని అన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య నాయకులు టీ.రాజేశ్, పీ.నాగేందర్, కుమార్, సునీల్, టీ.నందన్, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, సహకార, గ్రామీణ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు మినహాయించి మిగిలిన 12 ప్రభుత్వరంగ జాతీయ బ్యాంకులు సమ్మె కారణంతో మూతపడ్డాయి.