సంగారెడ్డి, డిసెంబర్ 30 : బాలలను హింసకు గురి చేయొద్దని, వారి హక్కులను కాపాడాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి వర్చువల్‌లో జువైనల్ చట్టంపై శిక్షణా శిబిరం నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అధ్యక్షతనలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, బాల సంరక్షణశాఖ అధికారులు, జువైనల్‌కి సంబంధించిన పోలీస్‌శాఖ, శిశుగృహ సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అణచివేతకు గురవుతున్న బాలలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా బాలలను కార్మికులుగా మార్చొద్దనిసూచించారు. అంతేకాకుండా వారి హక్కులను కాపాడాటానికి న్యాయ వ్యవస్థ తరఫున పూర్తి సహకారం అందజేస్తామన్నారు. శిబిరంలో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి హన్మంతరావు పాల్గొన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి..
సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 30 : బాలసదన్ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. గురువారం సంగారెడ్డిలోని బాలసదన్‌ను ఆయన తనిఖీ చేశారు. చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాలసదన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు ప్రశ్నలు వేసి ఉత్తేజాన్ని నింపారు. ఆయన వెంట 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ ఆశాలత, బాలసదన్ పర్యవేక్షకురాలు విజయ ఉన్నారు.