రంగారెడ్డి, వికారాబాద్,మేడ్చల్ జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొనసాగిన విద్యాశాఖ
పూర్తి కావొచ్చిన విభజన ప్రక్రియ
మహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మండలాల ఉద్యోగుల సంఖ్యపై రాని స్పష్టత
ఉమ్మడి జిల్లాకు మంజూరైన పోస్టులు 12,199.. ఉన్నవి 10,686..
మొత్తం ఖాళీలు 1513 పోస్టులు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 3 : విద్యాశాఖలో ఉద్యోగుల విభజన కసరత్తు ముమ్మరంగా సాగుతున్నది. అన్ని శాఖల్లో విభజన ప్రక్రియ పూర్తికాగా.. విద్యాశాఖ ఒక్కటే మిగిలి ఉన్నది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రతిపాదికనే బదిలీలు, పదోన్నతులు, జీతభత్యాలు కొనసాగుతూ వస్తున్నాయి. త్వరలో ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో జిల్లా విద్యాశాఖ విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు మంజూరైన పోస్టులు ఎన్ని, ప్రస్తుతం పనిచేస్తున్న వారెంత మంది అనే వివరాలను సేకరిస్తున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కావొచ్చినప్పటికీ మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన పది మండలాల పోస్టుల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బోధన, బోధనేతర ఉద్యోగులకు కలిపి 12,199 పోస్టులు మంజూరుకాగా, 10,686 మంది పనిచేస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఇంకా 1513 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.
విద్యాశాఖలో ఉద్యోగుల విభజన కసరత్తు ప్రక్రియ జరుగుతున్నది. జిల్లాలు ఏర్పాటైనప్పటికీ విద్యాశాఖలో మాత్రం ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే బదిలీలు, పదోన్నతులు, జీతభత్యాలు ఇతరత్రా అంశాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. అన్ని శాఖల్లో ఇప్పటికే విభజన ప్రక్రియ పూర్తికాగా, విద్యాశాఖ ఒక్కటే మిగిలి ఉంది. త్వరలో ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ విభజన ప్రక్రియను చేపట్టింది. అంతేకాకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయినట్లయితే జిల్లాలవారీగా విద్యాశాఖలో ఖాళీల వివరాలపై కూడా స్పష్టత రానుంది. పాత రంగారెడ్డి జిల్లా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 37 మండలాల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతమున్న పోస్టుల లెక్క తేల్చుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు మంజూరైన పోస్టులు ఎన్ని, ప్రస్తుతం పనిచేస్తున్న వారెంత మంది అనే వివరాలను సేకరిస్తున్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను మూడు జిల్లాలకు మంజూరైన పోస్టులు, ప్రస్తుతమున్న పోస్టుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన పది మండలాలకు సంబంధించి మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న వారి లెక్క ఇంకా కొలిక్కి రాలేదు, జిల్లా విద్యాశాఖలో ఓ సంఖ్య, ట్రెజరీ వద్ద ఓ లెక్క ఉండడంతో మహబూబ్నగర్ విద్యాశాఖ అధికారుల నుంచి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చినప్పటికీ మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన పది మండలాల పోస్టుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాకు మంజూరైన పోస్టులు 12,199
విద్యాశాఖలో ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా నుంచి కలిసిన పది మండలాల్లోని పోస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బోధన, బోధనేతర ఉద్యోగులకు కలిపి దాదాపు 12,199 పోస్టులు మంజూరుకాగా, 10,686 ఉద్యోగులు బోధన, బోధనేతర ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. ఉద్యోగుల విభజనలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ వరకు మూడు జిల్లాలకు ఆయా జిల్లాల్లోని పాఠశాలలు, విద్యార్థులను బట్టి పోస్టుల మంజూరుతోపాటు పోస్టుల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంజూరైన పోస్టులు 12,199 పోస్టులుకాగా, బోధనేతర పోస్టులు 109 ఉన్నాయి. మిగతా 12090 టీచింగ్ పోస్టులున్నాయి. బోధనేతర మంజూరైన పోస్టులు 109 ఉండగా, 71 పోస్టుల్లో పనిచేస్తుండగా, మరో 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపీపీ, జడ్పీపీ స్కూళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు మంజూరైన పోస్టులు 11,603 పోస్టులుకాగా, 10,262 పోస్టుల్లో పనిచేస్తున్నారు. మిగతా 1341 పోస్టులు ఖాళీలున్నాయి.
సంబంధిత పోస్టుల్లో జిల్లాలవారీగా చూసినట్లయితే మేడ్చల్ జిల్లాకు మంజూరైన పోస్టులు 2984, పనిచేస్తున్నవారు 2708, రంగారెడ్డి జిల్లాకు మంజూరైన పోస్టులు 4426, పనిచేస్తున్నవి 3956, వికారాబాద్ జిల్లాకు మంజూరైన పోస్టులు 3775, పనిచేస్తున్నవి 3233, మహబూబ్నగర్ జిల్లాకు మంజూరైన పోస్టులు 418, పనిచేస్తున్నవి 365 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మొత్తం మంజూరైన పోస్టులు 388కాగా, పనిచేస్తున్నవి 299 ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాకు మంజూరైన పోస్టులు 5 కాగా, పనిచేస్తున్నవి 3, మేడ్చల్ జిల్లాకు 108 కాగా, పనిచేస్తున్నవి 87, రంగారెడ్డి జిల్లాకు133 కాగా, పనిచేస్తున్నవి 108, వికారాబాద్ జిల్లాకు మంజూరైన పోస్టులు 142 కాగా, పనిచేస్తున్నవి 101 ఉన్నాయి.
దాదాపు పూర్తి కావచ్చిన ఉద్యోగుల విభజన ప్రక్రియ : డీఈవో సుశీంద్రరావు
విద్యాశాఖలో ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాలకు మంజూరైన పోస్టులతోపాటు ఉన్న పోస్టుల వివరాలను సేకరిస్తున్నాం. ఇప్పటివరకు పాత జిల్లాల ప్రకారం కొనసాగిన విద్యాశాఖ కార్యకలాపాలు త్వరలోనే కొత్త జిల్లాల ప్రకారం కొనసాగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన పది మండలాల్లో పోస్టులపై స్పష్టత లేదు. ఆయా మండలాల నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరిస్తున్నాం.