
నీలగిరి, డిసెంబర్ 23 : ఉద్యోగులు విధి నిర్వహణలో వచ్చే ఒత్తిళ్లు తట్టుకుని నిలబడేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని అదనపు డీజీపీ, బెటాలియన్ డీజీ అభిలాష బిస్తా అన్నారు. నల్లగొండ మండలం అన్నెపర్తి 12వ బెటాలియన్లో పోలీస్ సిబ్బంది నాలుగు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు గురువారం ఆమె బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ నిరంతరం ప్రజల, దేశ రక్షణ కోసం పనిచేసే పోలీసులు అనేక ఒత్తిళ్లతో ఉంటారన్నారు. ఆ ఒత్తిడిని జయించి మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడుతాయన్నారు. ఒక్కరుగా గాక కలిసికట్టుగా పనిచేస్తే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలోని పోలీస్ సిబ్బందికి క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేస్తానన్నారు. క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం పొందవచ్చన్నారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు తమకు ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో రాణించాలన్నారు. బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య మాట్లాడుతూ ఐదేళ్లుగా బెటాలియన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్, జిమ్, క్రీడామైదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న, అశోక్, ఏ.తిరుపతి, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.