
యాదాద్రి, డిసెంబర్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ధనుర్మాసోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్వామి వారి ఆరగింపు అనంతరం బాలాలయ మండపంతో పాటు పాతగుట్ట ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ధనుర్మాన విశిష్టతను భక్తులకు వివరించారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమ అవుతుందని, ఈ మాసంలో భక్తులు ఆలయాలను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకొకటి చొప్పున 30రోజుల పాటు పఠిస్తూ మార్గళి పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు నల్లందీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు తెలిపారు. అదేవిధంగా పాశురాల పరమావధి ప్రాశస్త్యం భక్తులకు వివరించారు.
నిత్యపూజల కోలాహలం
ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు చేశారు. ఉత్సవ మండపంలో విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసీ అర్చనలు నిర్వహించారు. లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 10,21,094 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.