
ఎదులాపురం, డిసెంబర్ 28 : పట్టణంలో అందరి సహకారంతోనే దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్‌కు ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. రావత్ మరణం దేశానికి తీరనిలోటని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతికి రూ.6 కోట్ల 20లక్షలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో సహా పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ వెల్కమ్ బోర్డు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల వెడల్పు చౌరస్తాల సుందరీకరణ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిల్ సహకారంతో పూర్తి చేస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పట్టణ ప్రగతికి మరో రూ.50కోట్లు తీసుకువచ్చి ఆదిలాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, వార్డు కౌన్సిలర్లు భరత్, అజయ్, రఘువతి, బండారి సతీశ్, వెంకన్న, శ్రీను, శ్రీలత, అర్చన, అధికారులు పాల్గొన్నారు.