
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కలెక్టర్లకు సూచించారు. పథకాల అమలు, దళితబంధు, యాసంగి సాగు, ధాన్యం కొనుగోళ్లు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై హైదరాబాద్ ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనబోమనే విషయాన్ని వివరించాలని ఆదేశించారు.
ఖమ్మం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా ప్రజల చెంతకు చేర్చేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించుకోవాలని, ప్రతి పథకాన్నీ అర్హులకు అందేలా పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టర్లకు సూచించారు. తాను ఉన్నంత కాలం సంక్షేమ కార్యక్రమాలేవీ ఆగబోవని స్పష్టం చేశారు. రైతుబంధు, దళితబంధు పథకాలు తనకు రెండు కళ్లలాంటివని, వాటిని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని భరోసా కల్పించారు. దళితబంధు, యాసంగి సాగు, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై హైదరాబాద్ ప్రగతిభవన్ శనివారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మంత్రివర్గ సభ్యులతో కలిసి సీఎం మాట్లాడారు. దళితుల అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గంలో దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందించే సహాయం సామాజిక పెట్టుబడి లాంటిదన్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక కిలో వడ్లు కూడా కొనబోదని, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని సీఎం పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతులను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనబోమనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. అలాగే రాబోయే వానకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని ఆదేశించారు. లాభసాటి అయిన ఇతర పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు. అలాగే దళితబంధు నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. దళితబంధు ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే రూ.పది లక్షలు దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయన్నారు. ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో దళితబంధును ప్రభుత్వం అమలుచేస్తుందని, ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి సైతం నిధులు ఇస్తుందని అన్నారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలని కలెక్టర్లకు సూచించారు. దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పలు అంశాలను, జిల్లాల ప్రగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.