జూబ్లీహిల్స్ : తెలంగాణలో అట్టడుగున ఉన్న పేద ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది, సంక్షేమమే తారక మంత్రంగా టీఆర్ఎస్ పాలన అందిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో రూ.1 కోటి 10 లక్షలతో మంజూరైన బీటి రోడ్డు పనులకు కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకాలం పేదల బాగోగులను పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఈ విషయాన్ని ప్రజలకు ముందు వివరించిన తరువాత ప్రతిపక్షాలు విమర్శలు చేయాలా వద్దా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న తరుణంలో పేద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్ష పార్టీలు వారి పొట్టకొట్టి ఆ పాపం మూటగట్టుకుని చివరికి కనుమరుగైపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ది జరుగుతుంటే ఆమోదించి సద్విమర్శలు చేసే సత్తా లేని పార్టీలకు ప్రజల వద్ద స్థానం ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌లో అనూహ్యమైన అభివృద్ది జరిగిందని, నియోజకవర్గం అభివృద్ది పథంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎన్.సంతోష్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ.నర్సింగ్, నాయకులు పాల్గొన్నారు.