మణికొండ : ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి నిర్మించిన ప్రహారీగోడలను బుధవారం రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేశారు.
గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లి ప్రభుత్వ భూమి సర్వేనెంబరు 132లో గత కొన్నిరోజులుగా కొంత మంది స్థానిక నాయకులు, కబ్జాదారులు కలిసి యధేచ్చగా భూమిని ఆక్రమించి ప్రహారీగోడలను, గదులను నిర్మించి ఆక్రమణలు చేస్తుండటంతో సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి కె.చంద్రకళ నేతృత్వంలో ఆరు ప్రాంతాలలో వెలసిన నిర్మాణాలను జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు.
అనంతరం ఆ ప్రాంతంలో ఈ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ బోర్డులను ఏర్పాటుచేశారు. విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాచేయాలని యత్నిస్తే చట్టపరంగా క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని ఆర్డీవో చంద్రకళ హెచ్చరించారు.
ఇందుకు ప్రోత్సహించిన వారిపై సైతం కేసులు నమోదు చేయిస్తామన్నారు. గత కొన్నాళ్లుగా వట్టినాగులపల్లి గ్రామంలో సర్కారు భూములను కబ్జాలు చేస్తున్నారని వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు చేపడుతామన్నారు.