
మహ్మదాబాద్, డిసెంబర్ 10: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అనివార్యం. అలాంటి ఫోన్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న పరిస్థితుల్లో చాలా మంది నగదు లేకుండా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. అంగడికి వచ్చి జాగ్రత్తగా లేకుంటే సెల్‌ఫోన్ మాయమౌతుంది. సరుకులు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమై ఉండగా ఆగంతకులు ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. చుట్టు పక్కల గ్రామాలతోపాటు తండాల ప్రజలు అధికసంఖ్యలో ప్రతి శుక్రవారం సంతకు వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయాలు తదితర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సంతలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాటు వేసే అగంతకులు సెల్ఫోన్లను మూడోకంటికి తెలియకుండా కొట్టేస్తున్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడి మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా ప్రతి శుక్రవారం సంతలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నాయని వివిధ గ్రామాల ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ పోయిన బాధితులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు పోయిన సెల్ఫోన్లుగానీ, దొంగలుగానీ దొరకలేదు. దీంతో సంతకు వచ్చే ప్రజలు ఫోన్లు తీసుకురావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు సెల్‌ఫోన్ దొంగలను పటుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక బృందంచే విచారణ జరిపి త్వరలో ఫోన్ల దొంగల ముఠాను పట్టుకుంటా మని ఎస్సై రవిప్రకాశ్ వివరించారు.
కూరగాయలు కొనేలోపే..
సరుకులు కొని కూరగాయలు వేసుకుని జేబులో చూసుకునే సరికి సెల్‌ఫోన్ మాయమైంది. ఈ మధ్యనే 12 వేల రూపాయలకు కొత్త సెల్ ఫోన్ కొనుగోలు చేశాను. సరుకులు కొంటున్న సమయంలో మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు మొబై ల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. పోలీసులు నిఘావేసి దొంగలను పట్టుకొని ఇకముందు చోరీలు జరుగుకుండా చూడాలి
-యాదయ్యగౌడ్ మహ్మదాబాద్
రెప్పపాటులో కొట్టేశారు..
ఫోన్లు పోతున్నాయని సంగతి తెలిసికూడా ఎంతో జాగ్రత్తగా సంతలో సరుకులు కొంటుండగా రెప్పపాటులో ఫోన్ కొట్టేశారు. వెంటనే చూసుకుని నా నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తుంది. అగంతకులు చాలా తెలివిగా సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేశాం. వెంటనే అగంతకులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి.