తలకొండపల్లి, డిసెంబర్ 6 : ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి ఉండేది. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయేది. వీధి దీపాలులేక చీకటిమయంగా ఉండేది. ఇలా అనేక సమస్యల పుట్టగా ఉన్న హర్యనాయక్తండాకు ‘పల్లె ప్రగతి’పథకం ఒక వరంగా మారింది. మండల కేంద్రానికి అనుబంధంగా ఉన్న లక్ష్మీతండా, సూర్యాతండా, హున్యతండా, నర్సింగ్తండాల్లోని 252 ఇండ్లు, 1,200 జనాభా, 617 మంది ఓటర్లు ఉన్న హర్యనాయక్తండాను తెలంగాణ సర్కార్ నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. దీంతో ఆ గ్రామ దశదిశా మారి కొత్తందం వచ్చింది. పల్లె ప్రగతి నిధులకు తోడుగా ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. తండాల్లోని శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించడంతో పాటు పడావ్ బావులను పూడ్చివేశారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేస్తుండడంతో పల్లెంతా శుభ్రంగా మారింది. రూ.3కోట్ల30 లక్షల వ్యయంతో దేవునిపడకల్ తలకొండపల్లి బీటీ రోడ్డు పనులు పూర్తికావడంతో రవాణా సౌకర్యం ఏర్పడింది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. రూ.3 లక్షలతో 2 వేల మొక్కలను నాటి పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. వీటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు రూ.30 లక్షలతో రెండు వాటర్ ట్యాంక్‌లు, రూ.లక్షతో ప్రతి కాలనీలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రూ.8 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, రూ.5లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలనూ నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలను నాటడంతో పాటు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. నిత్యం గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో నీటిని పోస్తున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..
వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశాం. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశాం. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం.
స్వచ్ఛ గ్రామంగా మారింది..
నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించడంతో పాటు పడావు బావులను పూడ్చివేశాం. ప్రతి వీధిని శుభ్రం చేస్తుండడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాం.