
గుమ్మడిదల, డిసెంబర్ 15 : ఎవుసం అంటే ఆరుగాలం కష్టపడి పని చేసే రైతు గుర్తుకు వస్తాడు..తెల్లవారుజామునే లేచి పొలంబాట పట్టే రైతు వద్ద ఎడ్లతో పాటు రెండు పాడిగేదెలు ఉండేవి. వరి పంట వేసే సమయంలో ముందుగా నారుపోసి కూలీలతో నాటు వేస్తారు. మోటబావుల వద్ద ఎడ్లతో నీటిని తోడి పంటకు అందిస్తారు. సమయానికి కలుపుతీసి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే, వరి పొట్ట దశకు వచ్చినప్పటి నుంచి ధాన్యం గట్టిపడగానే కోతలు కోసి, కట్టలుగా కట్టి కల్లం చేసి మెద కొట్టి ధాన్యాన్ని వేరు చేయడం, కట్టలుగా ఉన్న వరి గడ్డిని ఒక చోట వేసి ఎడ్లతో బంతి కొట్టడం చేస్తారు. వచ్చిన వడ్లను వేరు చేసి మిగిలిన గడ్డిని ఎండ బెట్టి మోపులుగా మార్చి పశుగ్రాసానికి వినియోగిస్తారు. అయితే, ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తున్నది. కూలి కూడా అధికంగా చెల్లించాల్సి వస్తుండడంతో వ్యవసాయరంగంలో యాంత్రీకరణ పెరిగిపోతున్నది. దీంతో రైతులు కూడా యాంత్రాలను అద్దెకు తీసుకువచ్చి తక్కువ సమయంలో పని పూర్తి చేసుకుంటున్నారు.
పశుగ్రాసం కొరత..
గుమ్మడిదల మండలంలో ప్రధాన పంటగా వరిని సాగు చేస్తున్నారు. కాలక్రమేణా వ్యవసాయకూలీల కొరత కావడంతో వారి స్థానంలో పంట పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. వరి కోతలు కోయడానికి పది ఏండ్ల క్రితం హార్వేస్టర్లు వచ్చాయి. ఈ యంత్రంతో వరిధాన్యం వస్తున్నప్పటికీ పశుగ్రాసానికి వినియోగించే గడ్డి మాత్రం పొలంలోనే మిగిలిపోతున్నది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడుతున్నది. ఈ కారణంతో రైతులు తమ పశువులను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బేలర్ యంత్రంతో కొరతకు చెక్
హార్వేస్టర్లతో కోతలు చేసిన తర్వాత వృథాగా మిగిలిన వరిగడ్డిని కట్టలుగా చేసి మోపులుగా చేయడానికి బేలర్ యంత్రం మార్కెట్లోకి వచ్చింది. దీంతో హార్వేస్టర్తో కోసిన పొలంలో బేలర్తో గడ్డిని ఒక్కచోటకు తీసువచ్చి మోపులుగా కడుతుండడంతో రైతులకు పశుగ్రాసం కొరత తీరింది. ఇప్పుడు ఏగ్రామంలో చూసినా బేలర్ యంత్రాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో ఈ యంత్రం రూ. మూడున్నర లక్షల నుంచి రూ. ఐదు లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రంతో గడ్డిని మోపులుగా చేయడానికి రూ.30 నుంచి 40 ఖర్చు అవుతుంది. ఈ మోపులను రూ. 80కి విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు కొంత ఆదాయం కలిసి వచ్చింది.
ఆధునిక పద్ధతులు పాటించాలి
రైతులు వానకాలంలో సాగు చేసిన వరి పంటను హార్వేస్టర్లతో కోతలు కోస్తున్నారు. పొలంలో మిగిలిన వరిగడ్డిని తగుల బెడుతున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగి భూసారం తగ్గుతుంది. గడ్డిని తగులబెట్టకుండా యూరియాతో మాగ బెట్టాలి. పొలంలో కలియదున్నాలి. దీనివల్ల పొలంలో కర్బనం, నత్రజని శాతం, పోషక విలువలు, భూసారం పెరుగుతాయి. బేలర్ యంత్రంతో గడ్డిని మోపులగా చేసి పశుగ్రాసానికి వినియోగించవచ్చు. రైతులకు కొంత మేర వ్యవసాయ ఖర్చులు కలిసివస్తాయి.
-జావిద్, వ్యవసాయాధికారి, గుమ్మడిదల మండలం