e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, December 3, 2021
Home ఆదిలాబాద్ రాతి గుట్టలపై రతనాల పంట

రాతి గుట్టలపై రతనాల పంట

రాళ్లు రప్పలున్న భూములను సాగులోకి తెచ్చిన గిరి బిడ్డ
చెరువుల మట్టిని తరలించి అనుకూలంగా మార్చిన ఆదివాసులు
రెండు నెలల పాటు కష్టపడ్డ 255 మంది గ్రామస్తులు
ప్రస్తుతం 1260 ఎకరాల్లో పంటలు
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
ఎకరాకు 35 బస్తాల ధాన్యం.. రూ. 50 వేలకు పైగా ఆదాయం
పత్తి సాగులో రూ. 40 వేల నుంచి రూ. 50 వేల దాకా..
ఆదర్శంగా నిలుస్తున్న గుండాల వాసులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (నమస్తే తెలంగాణ)/తిర్యాణి, నవంబర్‌ 24 : ఒకప్పుడు ఆ గుట్టపై ఎటు చూసినా రాళ్లు రప్పలే.. ఎత్తైన కొండ.. ఎగుడు దిగుడు భూములు.. చుక్క నీరైనా నిలువని అలాంటి ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని సిరులు పండిస్తున్నారు గుండాల గిరిజన గ్రామ రైతులు. ఓ యువకుడు బొజ్జిరావ్‌కు వచ్చిన ఆలోచనతో ప్రస్తుతం ఆ గుట్టపై ఎటు చూసినా పంటలే దర్శనమిస్తున్నాయి. దాదాపు 1260 ఎకరాల్లో వరి, పత్తి, జొన్న, కందితో పాటు తదితర పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టపై గుండాల గ్రామం ఉంది. ఇక్కడ నివసించే వారంతా ఆదివాసులే. ఈ గుట్టపై మైసమ్మ కుంట, మచ్చకుంట, మోతీరాం కుంట చెరువులున్నప్పటికీ రాళ్ల భూముల్లో పంటలు పండించుకునే వీలుండేది కాదు. ఇదే గ్రామానికి చెందిన బొజ్జిరావు 1983లో హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ ఎంఈడీ పూర్తి చేసి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనకో ఆలోచన వచ్చింది. ఎలాగైనా రాళ్లు రప్పలున్న భూమిని సాగులోకి తేవాలనుకున్నారు. ఇంకేముంది చెరువుల్లోని మట్టిని ఎడ్లబండ్ల ద్వారా తీసుకొచ్చి రాళ్లు.. రప్పలున్న భూముల్లో అడుగున్నర మందం పోశారు. సుమారు రెండు నెలల పాటు 255 మందితో కలిసి కష్టపడి 1250 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. కొంతకాలం వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించారు. ఆ తర్వాత చెరువుల నీటిని పంట పొలాలకు మళ్లించి ఏటా రెండు పంటలు తీస్తున్నారు.

- Advertisement -

చెరువు మట్టితో పెరిగిన భూసారం…
గుండాల గుట్టలపై ఉన్న రాళ్ల భూముల్లో రైతులు చెరువుల మట్టిని వేసి నేల సారాన్ని బాగా పెంచారు. చెరువుల్లోని మట్టిని ఎడ్లబండ్ల ద్వారా రైతులు తీసుకువచ్చి తమ చెరువుల్లో వేసి భూసారాన్ని పెంపొందించారు. సుమారు రెండు నెలల పాటు కష్టపడి గుండాలలోని 255 మంది కలిసి చెరువుల్లోని మట్టిన 1260 ఎకరాలకు తరలించారు. దీంతో రాళ్ల భూములు సైతం సారవంతమైన నేలలుగా మారి పంటలకు జీవం పోశాయి.

మేలైన దిగుబడులు సాధిస్తూ..
వంద శాతం సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి ఆదివాసులు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో దర్శనమిచ్చిన ఈ భూముల్లో ఇప్పుడు వరి, జొన్న, కంది, పెసర, పత్తి, మక్క, శనగలు, ఇతర చిరుధాన్యాలు పండిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కృషి వికాస్‌యోజన పథకం కింద గుండాల గ్రామాన్ని ఎంపిక చేసి.. 50 మంది రైతులతో 200 ఎకరాల్లో వరి సాగు చేయిస్తున్నారు. ఎకరం వరి సాగు చేస్తే 35 బస్తాల దిగుబడి వస్తున్నది. పెట్టుబడి రూ. 6 వేల లోపు అవుతున్నదని, రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఆదాయం వస్తున్నదని, ఇక పత్తి సాగు చేస్తే ఎకరంలో 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు రూ. 7 వేలు పోను.. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల దాకా ఆదాయం వస్తున్నదని వారు చెబుతున్నారు. గతేడాది వర్షాకాలంలో 250 ఎకరాల్లో వరి, 17 ఎకరాల్లో మక్క, 581 ఎకరాల్లో పత్తి, 14 ఎకరాల్లో పెసర, 288 ఎకరాల్లో కందులు, మిగతా ఇతర పంటలు సాగు చేయగా, ఈ యాసంగి సీజన్‌లో 22 ఎకరాల్లో శనగలు, 26 ఎకరాల్లో జొన్నలు, 16 ఎకరాల్లో మక్క సాగు చేశారు.

సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం..
సమీప చెరువుల్లోని మట్టిని తీసుకొచ్చి పంటపొలాల్లో వేసుకున్నారు. జీవామృతం, బ్రహ్మస్త్రం, పంచగవ్వల తయారీకి ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, వేపగింజలు, వేపాకులు తదితర వాటితోనే సేంద్రియ ఎరువు తయారు చేసి పంటల్లో వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వర్షాకాలంలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందించే వరి, కందులు, పెసర్లు, యాసంగిలో 90 శాతం రాయితీపై శనిగలు, చిరుధాన్యాలైనా కొర్రలు, రాగులు, సామలు తదితర వాటిని సాగు చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఇక్కడ పండించిన ధాన్యాలకు మార్కెట్‌కంటే ఎక్కువ ధర పలుకుతున్నది.

సమష్టి కృషి వల్లే మేలైన పంటలు..
గుండాలలో రైతులు సమష్టిగా ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ పద్ధతులు పాటించి మేలైన పంటలతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకుగాను 2018లో అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా రూ.50 వేల రివార్డును గుండాల రైతులు అందుకున్నారు. గుండాల రైతులకు ఉత్తమ సేంద్రియ రైతులుగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం యేటా అందిస్తున్న పంటరుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లిస్తున్నారు.
-తిరుమలేశ్వర్‌, వ్యవసాయ అధికారి, తిర్యాణి

రెండు నెలలు కష్టపడ్డాం..
ఏమాత్రం పనికి రాని భూములను కష్టపడి సాగుకు అనుకూలంగా మార్చుకున్నాం. చెరువుల్లోని మట్టిన ఎడ్ల బండ్లలో తీసుకొచ్చి భూముల్లో అడుగున్నర మందం పోశాం. రెండు నెలల పాటు కష్టపడాల్సి వచ్చింది. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ఎకరంలో వరి, మరో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్న. ఎకరం వరిలో రూ. 5 వేల పెట్టుబడి అవుతుంది. సుమారు 30 బస్తాల దిగుబడి వస్తుంది. ఖర్చులుపోను రూ. 40 వేల దాకా మిగులుతయి. రోజూ ఊర్లళ్లల కూరగాయలు అమ్ముత. ప్రతి నెలా రూ. 15 వేల దాకా సంపాదిస్తా.

  • కోవ మోతిరాం, గుండాల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement