మాక్లూర్, డిసెంబర్ 23 : పోషక విలువలతో కూడిన పంటలను పండించాలని, ఆర్గానిక్ (ప్రకృతి) పంటలను సాగుకు మొగ్గు చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఏర్పాటు చేసిన దేశీ వరి విత్తన శుద్ధి కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాల గురించి రైతు చిన్నికృష్ణుడు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం గ్రామంలోని రైతువేదికలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని, డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. ఐదేండ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యేదని, ప్రస్తుతం 7.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేవలం నిజామాబాద్ జిల్లాలోనే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ఒక్క సీజన్లోనే 78 వేల మెట్రిక్‌టన్నుల యూరియా కావాల్సి వస్తుందని వివరించారు. 70 ఏండ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉండి ఆర్గానిక్ (ప్రకృతి) వ్యవసాయం చేస్తున్న రైతు చిన్నికృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 2007 నుంచి ఆర్గానిక్ పంటలు పండిస్తున్నానని చిన్నికృష్ణుడు తెలిపారు. అనంతరం మెదక్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఆదర్శ రైతు దంపతులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఏవో గోవింద్, సర్పంచ్ లింగన్న, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఏవో పద్మ, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో శ్రీనివాస్, పీఎం జన్యోజన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, రైతు మమ్మాయి రాజన్న, ఏఈవోలు, పీఏసీఎస్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.