
వెల్దుర్తి, జనవరి 3 : నియోజకవర్గంలోని వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు త్వరలోనే గజ్వేల్ నుంచి గోదావరి తాగునీటి జలాలు రానున్నాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలో సోమవారం ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారానికి వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు గజ్వేల్ నుంచి గోదావరి జలాలను తరలించడానికి రూ. 35 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్, సంపులు, ట్యాంక్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభించి గోదావరి తాగునీటి జలాలను సరఫరా చేయనున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గిరిజనతండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ. 146 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెల్దుర్తిలో రెండు పడక గదుల ఇండ్ల వద్ద తాగునీటి ట్యాంకు, ఆరెగూడెం స్టాపు నుంచి 132 కేవీ సబ్‌స్టేషన్ వరకు రెండు వరుసల రోడ్డు, డివైడర్ నిర్మాణం, బండపోసాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై వెనకడుగు వేయడంతో, యాసంగిలో రైతులు అరుతడి పంటలు, ఇతర పంటల సాగుకు మొగ్గుచూపాలని సూచించారు. అంతముందు వెల్దుర్తి మండలంలోని 83 మంది కల్యాణలక్ష్మి లబ్ధ్దిదారులకు చెక్కులు, మాసాయిపేటలో 34 మందికి అందజేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రమేశ్ గౌడ్, వెల్దుర్తి, మాసాయిపేట తహసీల్దార్ సురేశ్ కుమార్, మాలతి, ఎంపీడీవో జగదీశ్వరాచారి,ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అధికారులు పాల్గొన్నారు.