క్వింటాల్‌కు రూ.8,715గా నమోదు
మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర
ప్రతిరోజు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు
గత ఏడాది కేవలం రూ.5,650
ఈ నెల 14 నుంచి రూ.8 వేలపైనే..
మురిసిన పత్తి రైతులు
వరంగల్, డిసెంబర్ 28(నమస్తేతెలంగాణ) : తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో రైతన్నకు మంచి ఆదాయం వస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలుకుతున్నది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ.8,715 పలికింది. మార్కెట్ చరిత్రలో పత్తికి ఇదే అత్యధిక ధర. నవంబర్ 2న క్వింటాల్ పత్తి ధర రూ.8,570 పలికింది. మునుపెన్నడూ లేని రీతిలో ధర పలుకుతుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ పత్తికి రికార్డు స్థాయిలో రూ.8,715 ధర పలికింది. మంగళవారం రైతు బెల్లి మల్లేశం పత్తికి ఈ ధర లభించింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మల్లేశం 27 బస్తాల్లో పత్తిని ఎనుమాముల మార్కెట్‌కు తెచ్చాడు. మార్కెట్లోని వేణుగోపాలస్వామి ట్రేడర్స్ అడ్తి ద్వారా అశోక కాటన్ ఇండస్ట్రీస్ ఖరీదుదారు పత్తిని క్వింటాల్‌కు రూ.8,715 చొప్పున కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ.6,025. దీనిపై అదనంగా రూ.2,690 లభించడంతో పత్తి రైతులు మురిసిపోయారు.
గత ఏడాది రూ.5,650..
ఈ మార్కెట్లో గత ఏడాది 2020 నవంబర్ 24న క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.5,650. 23న ఈ ధర రూ.5,605 ఉంటే 25న రూ.5,640 పలికింది. గత ఏడాది ఈ మూడు రోజులు మాత్రమే పత్తి క్వింటాల్ ధర రూ.5,600 దాటింది. 2020 నవంబర్ 27న రూ.5,570గా ఉంది. ఈ ఏడాది అదే నవంబర్ 25న ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.7,870 ఉంటే 26న రూ.8,015 పలికింది. గత డిసెంబర్ 2న ఎనుమాముల మార్కెట్లో పత్తి క్వింటాల్ అత్యధిక ధర రూ.5,500గా నమోదైంది. ఈ ఏడాది అదే డిసెంబర్ 2న రూ.7,780 పలికింది. ఈ నెల 14వ తేదీ నుంచి వరుసగా ప్రతిరోజు గరిష్ఠ ధర రూ.8వేలకుపైగా పలుకుతోంది. 14న రూ.8,080 ఉండగా ఆ తర్వాత వరుసగా రూ.8,025, రూ.8,060, రూ.8,120, రూ.8,250, రూ.8,180, రూ.8,200, రూ,8,230, రూ,8,230, రూ,8,280, రూ, 8,515, రూ.8,715 పెరుగుతూ వచ్చింది.
6,186 క్వింటాళ్ల పత్తి రాక..
ఎనుమాముల మార్కెట్‌కు రైతులు 10,736 బస్తాల ద్వారా 6,186 క్వింటాళ్ల పత్తిని తెచ్చారు. ఇందులో 5,368 క్వింటాళ్ల పత్తిని మార్కెట్లోని వ్యాపారులు, 818 క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ మిల్లుల నిర్వహకులు కొనుగోలు చేశారు. రైతులకు గరిష్ఠ ధర రూ.8,715, కనిష్ఠ ధర రూ. 7,200, మోడల్ ధర రూ. రూ.8,350 లభించింది. రైతులు సోమవారం 12,204 బస్తాల ద్వారా 6,727 క్వింటాళ్ల పత్తిని మర్కెట్‌కు తీసుకువచ్చారు. ఇందులో మార్కెట్ వ్యాపారులు 6,102, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు 625 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దీనికి గరిష్ఠ ధర రూ.8,515, కనిష్ఠ ధర రూ.7,000, మోడల్ ధర రూ.8,200 పలికింది. కొద్దిరోజుల నుంచి ప్రతిరోజు దాదాపు ఆరువేలకుపైగా క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,56,690 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు.