
కేసుల పేరుతో ఏండ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారుల పాలిట లోక్‌అదాలత్ వరంలా మారింది. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ప్రీలిటిగేషన్ కేసుల్లోనూ ఇరువర్గాలకు రాజీ కుదిర్చి శాశ్వత పరిష్కారాన్ని చూపెడుతున్నది. చిన్నపాటి గొడవల నుంచి ఆర్థిక లావాదేవీలు, బీమా, భూవివాదాలు, అత్తింటి వేధింపులు, మనోవర్తి, చట్టరీత్యా రాజీకి అర్హమైన కేసుల్లో పైసా ఖర్చు లేకుండా ఇరువర్గాలకు న్యాయం జరిగేలా న్యాయమూర్తులు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. లోక్‌అదాలత్‌లో ఒక్కసారి కేసు పరిష్కారమైతే మరోసారి అదే కేసు విషయమై కోర్టు మెట్లు ఎక్కే అవసరం లేకపోవడంతో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్ వేదికవుతున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒక్కసారి కోర్టు మెట్లెక్కితే ఏండ్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో లోక్ అదాలత్ సామాన్యుల పాలిట వరంలా మారుతున్నది. సంవత్సరాల తరబడి విలువైన సమయంతోపాటు డబ్బును వృథా చేసుకుంటున్న కక్షిదారులకు లోక్ అదాలత్ తీర్పులు స్వాంతన చేకూరుస్తున్నాయి. రాజీమార్గమే రాజమార్గమనే లక్ష్యంతో సాగుతున్న లోక్ అదాలత్ ఎంతో మంది ఇబ్బందులను దూరం చేస్తున్నది. లోక్ అదాలత్‌లో ఒకసారి కేసు పరిష్కారమైతే మరోమారు అదే కేసు విషయమై కోర్టు మెట్లు ఎక్కే అవసరం లేకపోవడంతో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ప్రీ లిటిగేషన్(కోర్టుకు రాకముందు న్యాయ సేవాధికార సంస్థకు వచ్చివవి) కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నారు. దీంతో అనేక మంది కక్షిదారులు కేసుల నుంచి బయటపడుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించి, వారిలో రాజీమార్గం కుదిర్చి, కేసులను పరిష్కరించడంలో లోక్ అదాలత్ ప్రత్యేకతగా నిలుస్తున్నది. లోక్ అదాలత్‌లో వచ్చిన తీర్పు.. ఏండ్లుగా పెండింగ్‌లో ఉండి, న్యాయస్థానంలో వచ్చిన తుది తీర్పుకు సమానమని న్యాయమూర్తులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతుండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది కేసులు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయ స్థానాల్లో నిర్వహిస్తున్నారు.
వెనువెంటనే పరిష్కారం…
జిల్లా కోర్టులో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు, హైకోర్టులో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంటుంది. కానీ లోక్ అదాలత్‌లో వచ్చిన తీర్పును తుది ఫలితంగానే భావిస్తారు. రెండువైపులా కక్షిదారులు రాజీకి రావడంతోనే కేసు పరిష్కారం అవుతుండగా ఈ తీర్పును సవాల్ చేయడం, పైకోర్టును ఆశ్రయించడం వంటి అవకాశాలు ఇందులో ఉండవు. ఇలాంటి విషయాలపై గతంలో కన్నా ప్రజలకు పరిజ్ఞానం పెరగడంతోపాటు న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ వారు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. చిన్నచిన్న తగాదాలకు వెనువెంటనే పరిష్కారం.. ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరించడానికి లోక్ అదాలత్‌లు చక్కని మార్గంగా నిలుస్తున్నాయి. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీకుదిర్చి ఇరువర్గాలకు న్యాయం అందేలా పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా అప్పీలు చేసుకోవడానికి వీలు లేని విధంగా పరిష్కారం చూపుతారు. దీంతో వీటికి ఆదరణ పెరిగి వందలాది దావాలు పరిష్కారమవుతున్నాయి. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా ఉంటున్నారు. సంవత్సరాల తరబడి పరిష్కారం పొందని ఎన్నో కేసులు లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతున్నాయి.
ప్రజలకు భారీ ఊరట..
పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బున్నా, లేకపోయినా అందరికీ సరైన న్యాయం అందించేందుకు ప్రభుత్వమే జాతీయ, రాష్ట్ర, జిల్లా, కిందిస్థాయిల్లోనూ న్యాయ సేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం 1976లో భారత రాజ్యాంగానికి 39-ఏ జతచేసి పేదలు, బలహీన వర్గాలకు ఈ సంస్థ ద్వారా ఉచిత న్యాయం అందిస్తున్నది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా, మరో న్యాయమూర్తి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం ఆవరణలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో చేపట్టే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. బాధితులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని పనిదినాల్లో సంప్రదించవచ్చు. దూరభారం అనుకునేవారు స్థానికంగా ఉన్న న్యాయస్థానాల్లో నిర్వహించే లోక్ అదాలత్‌లో పాల్గొని పరిష్కారం పొందవచ్చు. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతోపాటు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే సంస్థనే న్యాయవాదిని ఉచితంగా ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తుంది. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులను సంప్రదించినా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కోసం సాయం అందిస్తారు.
వేలాది కేసులకు మోక్షం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 27కోర్టులు పని చేస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో 13 కోర్టులున్నాయి. బోధన్‌లో నాలుగు, కామారెడ్డిలో నాలుగు, ఆర్మూర్‌లో మూడు కోర్టులున్నాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు(జూనియర్ సివిల్ జడ్జి)లున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన 3,346 కేసులు పరిష్కారమయ్యాయి. జూలై 10న నిర్వహించిన లోక్ అదాలత్‌లో 3,688 కేసులు, సెప్టెంబర్ 11న నిర్వహించిన కార్యక్రమంలో 1433 కేసులను పరిశీలించి ఇరువర్గాల సమ్మతితో న్యాయమూర్తులు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపించారు. చట్టాలపై ప్రజలకు అవగాహన ఉంటే సరైన న్యాయం పొందడంతోపాటు నేరాలకు పాల్పడకుండా ఉంటారు. ఈ నేపథ్యంలో న్యాయ సేవా అధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య వివాహ సంబంధమైన వివాదాలు, మనోవర్తి, విడాకులు, అత్తింటి వేధింపులు తదితర అన్ని రకాల సివిల్ కేసులు, భూ వివాదాలు, చట్ట రీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులూ లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా శాశ్వతమైన అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారాలను పొందవచ్చు.