
గజ్వేల్, డిసెంబర్ 23: వరిని వదిలి అధిక ఆదాయం పొందేందుకు వీలుగా రైతులను వాణిజ్య పంటల సాగు వైపుగా మళ్లించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని, ఆ దిశగా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయ 7వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలను మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి రోజాశర్మ, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకు ముందు వర్సిటీ ఆవరణలో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం, చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు. వర్సిటీలో పండించిన కూరగాయలు, పువ్వులు, పండ్ల స్టాళ్లను మంత్రికి ప్రొఫెసర్లు వివరించారు. ఏడేండ్లలో కనుగొన్న కొత్త అంశాలు, పరిశోధనలను ప్రదర్శించారు. పరిశోధన విభాగాల ప్రదర్శనశాలను మంత్రి సందర్శించారు. సభా కార్యక్రమంలో ఉద్యానవర్సిటీ సాధించిన ప్రగతిపై సుద్దాల అశోక్ తేజ రచించిన ప్రత్యేక గీతం సీడీని మంత్రి ఆవిష్కరించారు. వర్సిటీలో పండించిన పంటల విక్రయాల కోసం తయారు చేసిన ట్రేడ్‌మార్క్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు అన్నివిధాలుగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార దృష్టితో వ్యవసాయాన్ని చూడవద్దని, రైతులకు సేవ చేయడానికే వ్యవసాయరంగాన్ని చూడాలని ప్రభుత్వాలకు ఆయన సూచనలు చేశారు. వరి పండించడంతో నష్టపోతున్న రైతులను ఆయిల్‌పామ్, వేరుశనగ, పత్తి, తదితర వాణిజ్య పంటల వైపు దృష్టి మరల్చే విధంగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉద్యానవన వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా పుస్తకాలు, పరిశోధనలతో పాటు రైతు పండించే పంటలను గ్రామాలకు వెళ్లి పరిశీలించాలని, వారికి అవసరమైన సలహాలు ఇస్తూ, అవసరమైన రీతిలో పరిశోధనలు చేయాలన్నారు. జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు లక్ష్యంగా పెట్టుకుని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ఎకరాకు రైతుకు లక్షా40వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. ఉద్యాన వన వర్సిటీ పరిశోధనల కోసం మరో 140ఎకరాల భూములను త్వరలో సేకరించి ఇస్తామని మంత్రి హరీశ్‌రావు సభాముఖంగా ప్రకటించారు. రైతులకు లాభాలు వచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం
కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని ఏకైక ఉద్యానవన వర్సిటీ అని వీసీ నీరజ ప్రభాకర్ అన్నారు. ఇది దేశంలో నాలుగోది అన్నారు. బోధన, పరిశోధన, విస్తరణ అనే అంశాలే ఎజెండాగా వర్సిటీ పనిచేస్తున్నదన్నారు. విశ్వవిద్యాలయంలో రెండు హార్టికల్చర్ కళాశాలలు, రెండు ఉద్యానవన పాలిటెక్నిక్‌లు, పదకొండు పరిశోధనా కేంద్రాలు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నాయన్నారు. ఏడేండ్లుగా విశ్వవిద్యాలయం అనేక మైలురాళ్లను అధిగమించిందని, అనేక విజయాలను సాధించిందన్నారు. ఏప్రిల్ 2021లో వర్సిటీ మొదటి కాన్వకేషన్ నిర్వహించి మొత్తం 529మంది విద్యార్థులు యూజీ, పీజీ, పీహెచ్డీ డిగ్రీలను ప్రదానం చేశామని వీసీ తెలిపారు. 2014లో విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి 726 మంది గ్రాడ్యుయేట్లు, 110మంది ఎంఎస్సీ గ్యాడ్యుయేట్లు, 6పీహెచ్డీ గ్యాడ్యుయేట్లు ఉత్తీర్ణులయ్యారన్నారు. వర్సిటీకి చెందిన విద్యార్థుల నుంచి 54మంది జేఆర్ఎఫ్, 13మంది ఎస్సారెఫ్ పొందారని, ఐఏఆర్ఐ న్యూఢిల్లీ వంటి జాతీయస్థాయి ప్రీమియం ఇనిస్టిట్యూట్లలో విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఐఐహెచ్ఆర్ బెంగళూరు, ఎన్ఐఏఎం జైపూర్, దేశంలోని ఇతర రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, దేశంలోనే కాదు విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా హార్టికల్చర్‌లో తమ వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. వర్సిటీలో కొండాలక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి రోజున ప్రారంభించి, 6రోజుల పాటు పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు హార్టికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వీసీ తెలిపారు.
-వర్సిటీ ఆవిర్భావ సభలో వీసీ నీరజ ప్రభాకర్
పద్మశ్రీ పురస్కార గ్రహీత రైతు చింతల వెంకటరెడ్డికి సన్మానం
వర్సిటీ ఆవిర్భావ వేడుకల్లో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఉత్తమ రైతు, అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారతీయ రైతు చింతల వెంకటరెడ్డిని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా వర్సిటీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ పంట దిగుబడుల్లోనైనా ఏ,సీ,డీ విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైందన్నారు. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో, వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవన్నారు. ప్రభు త్వం సహకరిస్తే తెలంగాణలోని అన్ని పంటలకు డిమాండ్ వచ్చేలా చేయవచ్చని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసేలా మంత్రి హరీశ్‌రావు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, వర్సిటీ రిజిస్ట్రార్ ఎ.భగవాన్ తదితరులు పాల్గొన్నారు.