తెలంగాణ ప్రభుత్వం పండుగలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పేదలు పండుగ రోజును సంతోషంగా నిర్వహించుకోవాలన్న సదుద్దేశంతో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నది. బతుకమ్మ చీరలు, రంజాన్ గిఫ్ట్‌లను అందజేయడంతో పాటు ప్రతి క్రిస్మస్కు కానుకలను అందజేస్తున్నది. ఈసారి క్రిస్మస్ వేడుకలకు రంగారెడ్డి జిల్లాకు 5 వేలు, వికారాబాద్ జిల్లాకు 4వేల కానుకలు రాగా, పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తహసీల్దార్లతో పాటు క్రిస్టియన్ సంఘాలకు చెందిన ప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలను గుర్తించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కానుకలను అందజేయనుండగా, పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని ప్రభుత్వం నియమించింది. ప్రతి ఏటా వేడుకల కోసం కేటాయించిన మాదిరిగానే ఈసారి కూడా నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
పరిగి/ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16 : ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా క్రిస్మస్కు పేదలకు దుస్తులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ జిల్లాలో 4వేలు, రంగారెడ్డి జిల్లాలో 5వేల మందికి దుస్తులు అందజేయనున్నారు. అర్హుల ఎంపికకు సంబంధించి తహసీల్దార్లు, క్రిస్టియన్ సంఘాలవారితో నియోజకవర్గాలవారీగా కమిటీల నియామకాలు చేపట్టారు. ఈ నెల 17 లోగా అర్హుల ఎంపిక పూర్తి కానుంది. వేడుకల నిమిత్తం ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.2లక్షలు మంజూరు చేసింది.
నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్రిస్మస్ కానుకలను అందజేస్తారు. బుధవారం ఉమ్మడి జిల్లాకు వచ్చిన క్రిస్మస్ కానుకలను ఆయా నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. మరోవైపు క్రిస్మస్ కానుకల కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ప్రత్యేకాధికారులను నియమించారు. వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, పరిగికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత, తాండూరుకు ఆర్డీవో అశోక్‌కుమార్, కొడంగల్‌కు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్లను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నిరుపేదలకు క్రిస్మస్ కానుకలు అందజేయడంతోపాటు క్రిస్మస్ వేడుకల నిర్వహణకు వారిని నోడల్ అధికారులుగా నియమించారు.
ఈ నెల 20 నుంచి మండలాలవారీగా క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతన వస్ర్తాల పంపిణీతో పాటు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్డీవోలు, తహసీల్దార్లు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మండలాలవారీగా చర్చిల పాస్టర్ల నుంచి వివరాలను కూడా అధికారులు సేకరించారు. గతంలో మాదిరిగా తహసీల్దార్ల ఆధ్వర్యంలో పాస్టర్లతో ముందుగా సమావేశం నిర్వహించి ఒక్కో చర్చి పరిధిలో ఎంతమంది అర్హులైన వారున్నారో గుర్తించి వారి జాబితాను తయారుచేసి వారిని ఎంపికచేయనున్నారు. నియోజకవర్గస్థాయిలో క్రిస్మస్కు ముందు క్రైస్తవ సోదరులకు విందును ఏర్పాటు చేయనున్నారు. కాగా, క్రైస్తవుల సంఖ్య పెరుగుతున్నందున ఈ ఏడాది దుస్తులను మరింత ఎక్కువమందికి ఇవ్వడంతో పాటు విందు భోజనానికి కూడా ఈ నిధులను పెంచాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ సంఘాలు కోరాయి. విందు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అందరికీ ఒకేచోట ఏర్పాటు చేయాలా, లేక మండలాల వారీగా ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత రాలేదు.
వికారాబాద్ జిల్లాకు 4వేల కానుకలు
ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు