
కరకగూడెం, డిసెంబర్ 16: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, వాటిని సాధించుకునేందుకు ఇష్టపడి చదవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. మండలంలోని భట్టుపల్లి గ్రామంలో రూ.3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పాఠాలను ఏకాగ్రతతో వింటూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు అన్ని వసతులనూ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కొమరం కాంతారావు, సర్పంచ్లు తోలెం నాగేశ్వరరావు, పొలెబోయిన శ్రీవాణి, నర్సింహారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కస్తూర్బా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కరకగూడెం, డిసెంబర్ 16: అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. ‘ఇంటింటికీ కేసీఆర్.. గ్రామగ్రామాన టీఆర్ఎస్’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన గురువారం కరకగూడెం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత భట్టుపల్లి గ్రామంలో వాడవాడలా తిరిగిన రేగా.. ప్రజలను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు విన్నవించగా.. అందుకు గల కారణాలగ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సమాధానం పొంతన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు సమస్య తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భూమిపూజ చేశారు. తరువాత మండలంలోని కొత్తగూడెం, పాయంవారిగుంపు, గొగ్గలిగుంపు, కోరంవారిగుంపు గ్రామాల్లో పర్యటించారు. కాలినడకన వీధివీధినా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గొగ్గలిగుంపులో బొడ్రాయికి పూజలు చేశారు. ఇదే గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరుచేసి భూమి పూజ చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని నెంబర్స్థానంలో నిలుపుతానని స్పష్టం ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Efforts to solve public problems
