గజ్వేల్, డిసెంబర్ 18: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డికి మరోసారి ఎఫ్డీసీ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. గతనెల ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం ముగియగా, మరో రెండేండ్లు వంటేరు ప్రతాప్‌రెడ్డినే చైర్మన్‌గా తిరిగి నియమించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీకాలం పొడిగించడంపై నాయకులు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి కార్పొరేషన్‌కు చక్కని సేవలందించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, పార్టీకి అందుబాటులో ఉంటూ సేవలందించారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అవసరం, ఆపద వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటున్నారు. సమస్యల పరిష్కారంలో, ప్రజలకు సేవలందించడంలో ఆయన శైలిని గుర్తించి ఎఫ్డీసీ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ మరో రెండేండ్లు పదవీకాలాన్ని పొడిగించారు.
అందుబాటులో ఉంటా..
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్‌గా మరో రెండేండ్లు పదవీకాలం పొడిగించడంతో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. కార్పొరేషన్ ద్వారా హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించి, అడవుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కార్పొరేషన్‌ను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు. భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చేస్తానన్నారు.