చిగురుమామిడి, డిసెంబర్ 30: గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను గురువారం ఆయన సీపీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంతో మాట్లాడి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ దాస సుధాకర్‌ను ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో బొమ్మనపల్లి గ్రామస్తులు చురుగ్గా పాల్గొన్నారని, అదే స్ఫూర్తితో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాల అదుపునకు సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. బొమ్మనపల్లిలో పాలకవర్గ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీ చేశారు. బస్టాండ్ దర్గా వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కాగా, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, సీపీ సత్యనారాయణను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచ్ భూమిరెడ్డి, ఎంపీటీసీ మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణా రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు కత్తుల రమేశ్, ఉప సర్పంచ్ పెండ్యాల శారద-సదానందం, వార్డు సభ్యులు విజ్జగిరి, తిరుపతి, కొమురయ్య, మహేందర్, రమణయ్య, సరళ, రజిత, ప్రభ, వజ్రమ్మ, లక్ష్మి, కో-ఆప్షన్ సభ్యులు కళ్యాణి, రాజయ్య, దేవేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, నాయకులు సాంబారి కొమురయ్య, చిట్టిమల్ల శ్రీనివాస్, పెద్దపెల్లి అరుణ్, బోయిని మనోజ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.