ఖమ్మం వ్యవసాయం, జనవరి 2 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వ్యాపార లావాదేవీల్లో దూసుకుపోతున్నది. మార్కెటింగ్‌శాఖకు రూ.కోట్లలో ఆదాయాన్ని తీసుకువస్తున్నది. కొవిడ్ ప్రభావంతో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలూ కుదేలైనప్పటికీ ఖమ్మం ఏఎంసీ మాత్రం ఆదాయాన్ని రాబట్టడంలో ముందున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసీకి మార్కెటింగ్‌శాఖ రూ.17.61 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించగా ఏఎంసీ ఇప్పటికే రూ.13.63 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. మిర్చి సీజన్ ప్రారంభమైతే మార్చి వరకు మరింత ఆదాయం సమకూరనున్నది.
సీసీఐ కేంద్రాలు లేకున్నా… మిర్చి సీజన్ కాకున్నా..
ఈసారి పత్తికి మద్దతు ధర బాగున్నప్పటికీ సీసీఐ కేంద్రాల అవసరం లేకుండాపోయింది. దీంతో మార్కెట్‌కు అదనపు ఆదాయం వచ్చే మార్గం లేకుండాపోయింది. ఈఏడాది పత్తికి సీసీఐ క్వింటాల్‌కు రూ.250 నుంచి రూ.6 వేల వరకు పెంచింది. ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడంతో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు తెరమరుగయ్యాయి. సాధారణంగా మార్కెట్‌కు ఎక్కువ ఆదాయం వచ్చే వనరు మిర్చి. ఎందుకంటే అన్ని పంటల కంటే క్వింటాకు ఎక్కువ ధర పలికేది మిర్చి మాత్రమే. మిర్చి కొనుగోలు చేసిన ఖరీదుదారులు ప్రతి రూ.100 టర్నోవర్‌కు ఏఎంసీకి రూ.1 చెల్లించాలి కాబట్టి మిర్చి ఆదాయమే ఏఎంసీకి ఎక్కువ.సీసీఐ కేంద్రాలు లేకున్నా, మిర్చి కొనుగోళ్లు అంతగా లేకపోయినా ఏఎంసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించడం విశేషం.
పాలకవర్గం, యంత్రాంగం సమన్వయంతోనే..
మార్కెట్ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం, యంత్రాంగం సమన్వయంతో పనిచేసింది. దీంతో అనతి కాలంలోనే మార్కెట్ ఆదాయం రెట్టింపు అయింది. నాలుగు నెలల క్రితం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన డి.లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సెస్ వసూళ్లపై ప్రత్యేక నజర్ పెట్టిన సెక్రటరీ ఆర్.మల్లేశం పాత బకాయిలను వసూలు చేయడంలో విజయం సాధించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసీ ఇప్పటికే రూ.13 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. మిర్చి సీజన్ ప్రారంభమైతే మార్చి వరకు మరో రూ.7 కోట్ల వరకు ఆదాయం సమకూరనున్నది. ఈ చొప్పున ఏఎంసీ ఆదాయం భారీగా పెరగనున్నది.
కలిసి వచ్చిన మద్దతు ధరలు..
ఈ ఆర్థిక సంవత్సరం వానకాలం నుంచే మార్కెట్లో అపరాలు, వాణిజ్య పంటల ధరలు భారీగా పెరిగాయి. పెసరకు క్వింటా మద్దతు ధర రూ.7,275 కాగా గరిష్ఠంగా రూ.6,900 నుంచి కనిష్ఠంగా రూ.6,500 పలికింది. కందికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 పలుకగా వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.6,025 కాగా ప్రస్తుతం రూ.9 వేలకు పైగానే లభిస్తున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి ధర క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4 వేలు అదనంగా పలుకుతున్నది. మిర్చికి మద్దతు ధర లేనప్పటికీ ఏసీ రకానికి కొద్ది నెలల క్రితం రూ.17 వేలు-18వేల వరకు పలికింది. వీటితో పాటు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నది.
సహకరించిన వారందిరికీ కృతజ్ఞతలు..
మార్కెట్ ఆదాయం పెరగడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మార్కెట్ రైతులందరిదీ. మార్కెట్‌ను అభివృద్ధి చేసుకునే బాధ్యాత అందరిపైనా ఉంది. ఆదాయం పెరిగితే మార్కెట్లో మరిన్ని వసతులు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. కరోనా సంక్షోభ కాలంలోనూ మంచి ఆదాయం పొందాం. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని లక్ష్యాలు చేరుకుంటాం.
సకాలంలో సెస్ చెల్లించాలి
పంట కొనుగోలు చేసిన ఖరీదుదారులు సకాలంలో మార్కెట్‌కు సెస్ చెల్లించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. గతంతో పోల్చితే ప్రస్తుతం సెస్ వసూలు పెరిగింది. మార్కెట్ ఆదాయం రెట్టింపు అయింది. అంచనాకు మించి మార్కెటింగ్‌శాఖ ఆదాయం పొందుతున్నది.
-రుద్రాక్ష మల్లేశం, ఉన్నతశ్రేణి కార్యదర్శి, ఖమ్మం ఏఎంసీ