ఉపాధ్యాయుల డిస్ప్లేస్మెంట్పై కాషాయ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. అనేక విధాలుగా చర్చించి ప్రభుత్వం 317 జీవోను తీసుకువచ్చింది.. కేవలం కొద్దిమంది ఉపాధ్యాయులకు మాత్రమే బదీలు ఉత్తర్వులు వచ్చాయి.. శనివారం కరీంగనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన దీక్షపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో బహిరంగంగా మందీ మార్బలంతో దీక్ష చేపట్టడాన్ని తప్పుబడుతున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్/ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నూతన జోనల్ వ్యవస్థలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,032 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 4,150 మంది వరకు ఎస్జీటీలు ఉన్నారు. మిగిలిన సగం మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, లాంగ్వేజ్ పండిట్స్, ఇతర టీచర్లు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అత్యధికంగా ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే తమ మొదటి ప్రాధానత్య జోనల్ స్థానచలనానికి ఎంపిక చేసుకున్నారు. ఎస్జీటీల్లో ఖమ్మం జిల్లాలో 2 వేల మంది, భద్రాద్రి జిల్లాలో 1,850 మంది ఉన్నారు. స్థాన చలనాల్లో భాగంగా ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల నుంచి 500 మంది మాత్రమే ఖమ్మం జిల్లాకు వచ్చారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో సబ్జెక్ట్‌ల వారీగా అత్యధిక మందికి వారు పనిచేస్తున్న ప్రాంతాల్లోనే పోస్టింగ్స్ వచ్చాయి. నూతన జోనల్ వ్యవస్థలో కేవలం 5 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగింది.
అనవసరంగా దీక్షలు..
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం జోనల్ కొత్త వ్యవస్థను రూపొందించింది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు అమలవుతున్నాయి. ఉద్యోగులతో చర్చించిన తర్వాతే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాటగిరీల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తున్నది. కానీ బీజేపీ నేతలు రాష్ట్రంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ‘స్పౌజ్’ రెక్వెస్ట్ గురించి ప్రభుత్వం మున్ముందు చర్చించి పరిష్కరిస్తామని చెప్పింది. అయినా కాషాయ నేతలు దీక్షలు చేపట్టడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప జీవోను రద్దు చేయాలని దీక్ష చేపట్టడం సరికాదంటున్నాయి. కొవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీక్షలు చేటు చేస్తాయంటున్నాయి.
అడ్డంకులు సృష్టించొద్దు..
జీవోనంబర్ 317కు అడ్డంపడడం, అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదు. ఉద్యోగులు నిరుద్యోగులనూ దృష్టిలో ఉంచుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాన్ని కలిసి ప్రయత్నిస్తే బాగుంటుంది. దీని ద్వారా భవిష్యత్‌లో ఏ జిల్లా కోరుకుంటే ఆ జిల్లాకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
-మోరం వీరభద్రరావు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఖమ్మం
తక్కువ సంఖ్యలోనే స్థాన చలనం..
ప్రభుత్వం పాత జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇస్తున్నది. దీంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంతోమంది ఉపాధ్యాయులు దశబ్దాల నుంచి ఇతర జిల్లాల్లో పని చేస్తున్నారు. అత్యధిక శాతం మందికి జీవో నంబర్ 317తో నష్టం లేదు. చాలా తక్కువ మందికే స్థాన చలనం జరిగింది.
-చల్లా వేణు, హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్,
ఇందిరానగర్
జీవో రద్దు చేయమనడం సరికాదు..
317 జీవో వల్ల కొంత మందికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ జీవోలు రద్దు చేయమనడం సబబు కాదు. సవరణ చేయాలని అడిగి సమస్యను పరిష్కరించుకోవాలి. స్థానికత ఆధారంగా జోనల్ కేటాయింపులు జరగాలి. సీనియారిటీ ప్రకారం కోరుకున్న స్థానాలు కేటాయిస్తే సమస్యలు ఉండవు. జోనల్ వ్యవస్థను అందరూ మొదట్లో సమర్థించారు.
సామరస్యంగా పరిష్కరించుకోవాలి..
జోనల్ వ్యవస్థను అందరూ స్వాగతిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం టీచర్లను కేటాయించాలి. స్థానికత ఆధారంగా జోనల్‌ను కేటాయించడం శ్రేయస్కరం. ముందు నుంచి మన వాణిని వినిపిస్తే సమస్య ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నిబంధనలను వ్యతిరేకించడం సమంజసం కాదు.